తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి స్టాఫ్ నర్సు ఉద్యోగం!
స్క్రూటినీలో 145 మార్కులు అదనంగా నమోదు..
మూడు రోజుల తర్వాత గుర్తించిన అధికారులు
మిడ్జిల్, నవంబర్ 29: మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియలో మార్కుల నమోదు తప్పిదం వెలుగులోకి వచ్చింది. స్క్రూటినీ సమయంలో జరిగిన పొరపాటు కారణంగా తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో చేరిన మూడు రోజుల తర్వాత అధికారులు ఈ తప్పిదాన్ని గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో మొత్తం 45 పోస్టుల భర్తీకి 1,575 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 15 స్టాఫ్ నర్సు పోస్టులకు 750 మంది పోటీపడ్డారు.
ఇందులో 14 పోస్టులకు నిబంధనల ప్రకారం ఎంపికలు పూర్తికాగా, మరో పోస్టు ఎంపికలో పొరపాటు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కల్వకుర్తికి చెందిన వసంత అనే అభ్యర్థికి వాస్తవంగా 824 మార్కులు రాగా, స్క్రూటినీ సమయంలో పొరపాటున 969 మార్కులుగా నమోదు చేశారు. దీంతో ఓపెన్ కేటగిరీ మెరిట్ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్న ఆమెకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 25న మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరారు. అయితే, రాష్ట్ర కమిషనర్‌కు పంపించాల్సిన తుది జాబితా తయారీ సమయంలో మార్కులను మరోసారి పరిశీలించగా, సదరు అభ్యర్థికి 145 మార్కులు అదనంగా నమోదైనట్లు వెల్లడైంది. దీంతో అధికారులు ఆమె నియామక ఉత్తర్వులను రద్దు చేసి, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.