మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన
విద్యార్థులకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై షీ టీమ్ బోధన
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల షీ టీమ్(Mancherial She Team) ఎస్ఐ ఉషారాణి సూచించారు. మంగళవారం మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ మధ్య తేడాలను విద్యార్థులకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను తెరవడంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ ఉషారాణి తెలిపారు.
ఎవరైనా అసౌకర్యంగా ప్రవర్తించినా, ఇబ్బందులకు గురిచేసినా వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని చిన్నారులకు సూచించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైనప్పుడు షీ టీమ్‌ల సహాయం పొందాలని తెలిపారు. కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.