ఆర్టీసీ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌పై ఆక‌తాయిల దాడి!

29-11-2026 | 08:00pm

అడ్డుకున్న పోలీసుల విధులకు ఆటంకం.. ఆరుగురిపై కేసు

కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం

న‌ర్సాపూర్‌, నవంబర్ 29: విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆర్టీసీ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌పై కొంద‌రు ఆక‌తాయిలు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా దాడికి పాల్ప‌డ‌డ‌మే కాకుండా అడ్డుకున్న పోలీసుల‌పై కూడా దౌర్జ‌న్యం చేసిన ఘ‌ట‌న మెద‌క్ జిల్లా(Medak District) న‌ర్సాపూర్ ప‌ట్ట‌ణంలో జ‌రిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... ఆదివారం ఉదయం సంగారెడ్డి నుంచి నర్సాపూర్ మీదుగా గజ్వేల్‌కు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు నర్సాపూర్ చౌరస్తాలోని లక్ష్మీ హోటల్ సమీపంలో ప్రయాణికులను దించేందుకు ఆగింది.

ఈ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన వ్యక్తులు బస్సును అడ్డగించి, హారన్ మోగించిన విషయమై కండక్టర్ పొట్టి శ్రీకాంత్‌తో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్ కోదండ నరేష్ కుమార్‌పైనా దాడి చేశారు. వారిని రక్షించేందుకు వచ్చిన స్థానికుడు గోడ రాజేందర్‌పై వాటర్ బాటిల్‌తో దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఘర్షణను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. కండక్టర్ పొట్టి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు సయ్యద్ సఫాన్, ఆయేషా నజ్నీన్, జోయా, మహమ్మద్ జొహెబ్, నజరీన్, సయ్యద్ మొయిజుద్దీన్‌లపై కేసు నమోదు చేసిన‌ట్లు ఎస్‌ఐ ఎ.రంజిత్ కుమార్ తెలిపారు. 

క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి: మంత్రి పొన్నం

నర్సాపూర్‌లో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా రవాణా సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఆర్టీసీ సిబ్బంది ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా విధులు నిర్వహించాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు