ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి

17-11-2026 | 08:31pm

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

మేడిపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి(AISF State President Kasireddy Manikanta Reddy) డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యారంగంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం బోడుప్పల్‌లో ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టే ముందు విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో విస్తృతంగా చర్చించాలని సూచించారు. సంబంధిత వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హరీష్, కార్యదర్శి ఎండీ అన్వర్, సాయిని నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు