అవినీతి@ఎల్లంపేట
- అక్రమాలకు అడ్డగా మారిన మున్సిపాలిటీ
- డబ్బులిస్తేనే నిర్మాణ అనుమతులు
- అక్రమ కట్టడాల వెనుక భారీగా వసూళ్లు
- వసూళ్లకు ప్రత్యేక అధికారుల నిమాకం
- గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన టీపీఓ
- తాజాగా వార్డు ఆఫీసర్ పట్టివేత
మేడ్చల్, నవంబర్ 20 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ(Yellampet Municipality) అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో కొందరు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. లంచాల కోసం తీవ్రంగా వేధిస్తున్నారు. డబ్బులు ఇవ్వనిదే అనుమతులు ఇవ్వడం లేదు. అక్రమ కట్టడాలకు లక్షల్లో వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన రెండేళ్లలోనే ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం అవినీతి అక్రమాలకు అద్దం పడుతోంది.
ఈ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఇల్లు, గోదాంలో నిర్మించుకోవాలనుకుంటే అధికారులకు మామూళ్ళు ఇస్తే సరిపోతుంది. లంచాల వసూళ్లలో రహస్యం ఏమీ లేదు. అంతా బహిరంగమే. బహిరంగంగానే లంచాలు డిమాండ్ చేస్తారు. ఎల్లంపేట శివారులో అరుణ గోదాం అనుమతి లేకుండా నిర్మించారు. మున్సిపాలిటీకి వచ్చిన ప్రతి అధికారి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన ఒక అధికారి అరుణ గోదాంకు అనుమతి లేదని సీజ్ చేశారు. ప్రజలందరూ నిజాయితీ అధికారి వచ్చారని ప్రశంసించారు. కానీ ఆ తర్వాత అది ఎందుకు సీజ్ చేశారనేది తెలిసిపోయింది. కొద్ది రోజులకే సీజ్ తొలగిపోయింది. ఈ విషయమై పలువురు మున్సిపల్ అధికారుల్ని ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సీజ్ తొలగించామని చెప్పారు. అరుణ గోదాం విషయంలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది
వసూళ్లకు ప్రత్యేక అధికారి నియామకం..
మున్సిపల్ పరిధిలో వసూళ్లకు ప్రత్యేక అధికారుల్ని నియమించుకున్నారు. వసూళ్లలో ఆరితేరిన ఒక అధికారిని మున్సిపల్ కార్యాలయంలోనికి బదిలీ చేశారు. ఈ అధికారిపై మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారికి మామూలు వసూలు చేసి ఇవ్వడానికే ఈయనను మున్సిపల్ కార్యాలయానికి బదిలీ చేశారని పలువురు అంటున్నారు.
ప్రజాప్రతినిధులది అదే దారి..
మున్సిపాలిటీకి ఈ ఏడాది కొత్తగా పాలకవర్గం ఏర్పాటయింది. కొందరు ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటుండగా, మరికొందరు తమ పరిధిలో జరిగే అక్రమ నిర్మాణదారుల వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో ఒక షెడ్డు అనుమతి లేకుండా నిర్మించారు. ఈ షెడ్డు యజమాని వద్ద ఒక ప్రజా ప్రతినిధి ఎవరు రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చి లక్షల్లో వసూలు చేశాడు. ప్రస్తుతం షెడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ అక్రమ నిర్మాణం విషయంలో మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.
14 నెలల్లో ఇద్దరు అధికారులు..
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో 14 నెలలలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. శుక్రవారం రావల్ కోల్ వార్డు ఆఫీసర్ రవీందర్ రెడ్డి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అసెస్మెంట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. 2025 సెప్టెంబర్ 27న టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రప్రకాష్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. ప్రహారికి అనుమతి లేదని కూల్చి వేస్తామని భయపెట్టి రూ. ఐదు లక్షల డిమాండ్ చేశారు. ఒకసారి ఏసీబీ రైడ్ అయిందన్న భయం అధికారుల్లో కనిపించడం లేదు.
ఏసీబీ దాడులపై ముందే ప్రచారం..
ఎల్లంపేట మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు పెరగడంతో ఏసీబీ దాడులు జరుగుతాయని నెలరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పలువురు మున్సిపల్ అధికారులను అలర్ట్ చేశారు కూడా. అయినప్పటికీ వారి తీరు మారలేదు. కింది నుంచి పైదాకా లంచాల కోసం వేధిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎల్లంపేట మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాలని స్థానికులు కోరుతున్నారు.