అభ్యర్థులు లక్ష్యాలను చేరుకోవాలి

22-11-2026 | 05:30am

నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్

ముషీరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో(City Central Library) మిషన్ టీజీపీఎస్సీ ఇండియన్ జాగ్రఫీ(Mission TGPSC Indian Geography) పుస్తకాలను నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండవరంగల్‌ఖమ్మం పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పరికరాల నరేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందిస్తున్న మిషన్ టీజీపీఎస్సీ పుస్తక రచయిత అనిల్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరికరాల నరేష్ మాట్లాడుతూ అభ్యర్థులు చదివిన అంశాలను నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలని, ప్రతి అంశంపై పట్టు సాధించేలా కృషి చేయాలని సూచించారు.

నిరుద్యోగ జేఏసీ నేత రవి యాదవ్ మాట్లాడుతూ అభ్యర్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా మానసిక ధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు దామోదర్ రెడ్డి, కుమార్ రాథోడ్, రవి నాయక్, సవాయ్ సింగ్, వేణు, ప్రశాంత్, అనిల్ కుమార్ గౌడ్, హర్షిత, వీర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు