అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా..?
కేపీహెచ్బీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి
- నిర్వహణ లోపమే కారణం
- పనిచేయని లిఫ్టులు..
- పట్టించుకోని అధికారులు
- రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
కూకట్పల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రహదారిని దాటడానికి ఏర్పాటుచేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు(Foot overbridges) అధికారుల నిర్వహణ లోపించడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డలుగా మారుతున్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(Kukatpally Housing Board) కాలనీలోని మలేషియన్ టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్(Malaysian Township Raintree Park) వద్ద పాదాచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్వహణ లోపించడంతో అసాంఘిక కార్యకలాపాలకు(anti social activities) అడ్డగా మారింది. పాదచారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రస్తుతం ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా, ప్రమాదకరంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై లిఫ్టులు పనిచేయవు..
రోడ్డు దాటలేని వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ చాలా కాలంగా నిరుపయోగంగా ఉందని, లిఫ్టు మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇటు రోడ్డు దాటలేక, అటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి వెళ్ల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇదే సమస్యను చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అపరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాలు..
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కి వెళ్దామంటే అక్కడ తీవ్ర అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. బ్రిడ్జి పరిసరాలలో చెత్త చెదరాలు పేరుకుపోవడంతో పాటు మందు బాబులు తాగిన మద్యం సీసాలు దర్శనం ఇస్తున్నాయి. బ్రిడ్జిపై లైటింగ్ సదుపాయం లేకపోవడంతో మహిళలు, విద్యార్థినులు చీకటి పడితే అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రాత్రి వేళల్లో గంజాయి, మద్యం సేవించే అసాంఘిక శక్తులకు ఈ బ్రిడ్జి స్థావరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న పాదచారులు..
సాయంత్రం, రాత్రి వేళల్లో బస్సులు, క్యాబ్లలో అవతలి వైపు దిగిన మహిళలు, యువతులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిపై భద్రత లేకపోవడం, చీకటిగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రద్దీగా ఉండే ప్రధాన రహదారిని దాటుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించిన స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రతినిధులు..
మలేషియన్ టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గత కొంత కాలంగా నిరుపయోగంగా ఉండడంతో పాటు అక్కడ నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రతినిధులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద నెలకొన్న సమస్య లను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని స్థానికలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రతినిధులు నర్వ పవన్, తోట రమేష్,రేవతి,స్వర్ణ, గాయత్రి, వెంకటరమణ యాదవ్, తోట రాజశేఖర్, జగన్, స్వచ్ఛ భారత్ అభియాన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.