వసూల్ రాజాలపై చర్యలేవీ..?

07-10-2026 | 05:05am
  1. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు వసూళ్లు 
  2. ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలపై విచారణ 
  3. వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో బహిర్గతం 
  4. వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం 

మేడ్చల్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో(District Medical and Health Department) వసూల్ రాజాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనా మేషాలు లెక్కిస్తున్నారు. విచారణలో అవినీతి బహిర్గతమైనప్పటికీ చర్యలు తీసుకోవడానికి జాప్యం చేస్తుండడంతో ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్లో(Clinical Establishment Departments) కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల(Private hospitals) వద్ద భారీగా వసూళ్లకు పాల్పడినట్లు కొత్తగా వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే ఆనంద్ కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కీసర మల్కాజిగిరి డిప్యూటీ డిఎంహెచ్వో లతో విచారణ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల వద్దకు వెళ్లి విచారించారు.

రంగారెడ్డి జిల్లా తరహాలో వసూళ్లు..

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సీజ్ చేసిన ఆస్పత్రి తిరిగి ఓపెన్ చేయడానికి రూ. లక్ష డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్ జిల్లాలో కూడా అలాగే వసూళ్లకు పాల్పడినట్లు డిప్యూటీ డిఎంహెచ్వో ల విచారణలో తేలినట్లు తెలిసింది. ఆస్పత్రి సీజ్ చేయడం, డబ్బులు చెల్లించగానే తెరవడానికి అనుమతిని ఇవ్వడం పరిపాటిగా మారింది.

ప్రైవేట్ ఆస్పత్రులకు కిందిస్థాయి ఉద్యోగులే వెళ్లి వసూలు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. విచారణ సందర్భంగా కొన్ని ఫైళ్ళు మాయమయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి 590 దరఖాస్తులు రాగా 273 దరఖాస్తులు మాయం చేసినట్లు తెలిసింది. తమ బాగోతం బయటపడుతుందని 273 దరఖాస్తులు ఇవ్వడానికి మొండికేసినప్పటికీ తర్వాత ఇచ్చినట్లు తెలిసింది. 

డిప్యుటేషన్‌పై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తిష్ట 

కొంతమంది ఉద్యోగులు డిప్యూటేషన్ మీద జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో తిష్ట వేశారు. అది కూడా బాగా ఆదాయం వచ్చే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డిప్యూటేషన్ మీద రావడం వల్ల అక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. డీఎంహెచ్వో కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై లోతుగా విచారణ జరిపితే భారీ కుంభకోణం బయటపడే అవకాశం ఉంది. అంతేగాక ఇందులో పెద్ద తలకాయల అవినీతి అక్రమాలు కూడా బయటపడే అవకాశం ఉంది. శానిటేషన్ డిపార్ట్మెంట్ లోను పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కూడా అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 

విచారణ నివేదిక అందలేదు.. 

విచారణ రిపోర్టు ఇంకా తన చేతికి రాలేదు. తన చేతికి వచ్చిన తర్వాత పరిశీలిస్తాను. ఒకటి రెండు రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. 273 ఫైళ్లు కార్యాలయంలో ఉన్నాయి.

 డాక్టర్ కే.ఆనంద్, 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి 

మరిన్ని వార్తలు