సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలి
అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఘట్ కేసర్, నవంబర్ 11 (విజయక్రాంతి) : సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) చైర్మన్, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అనురాగ్ యూనివర్సిటీలో(Anurag University) పశ్చిమ మండల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్ 2026 బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ శిబిరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలతో పాటు దమన్ దీయూ, దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు. ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెడ్చల్ జిల్లా మహిళా భద్రతా విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషారాణి గౌరవ అతిథిగా, అనురాగ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ సంచాలకులు పశ్చిమ మండల ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్ డైరెక్టర్ ఆర్. సైదా, అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అసోసియేట్ డైరెక్టర్ సోషల్ లెర్నింగ్, శిబిర సమన్వయకర్త డాక్టర్ సి. మల్లేశ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీకి విచ్చేసిన ఎన్ఎస్ఎస్ ప్రతినిధులందరికీ ఘన స్వాగతం పలికారు. నిస్వార్థ సేవ, అంకితభావం, జాతీయ సమైక్యతా భావాలను ప్రతి వాలంటీర్ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, నాయకత్వ లక్షణాలు, సామాజిక భాగస్వామ్యం, సేవా కార్యక్రమాల ద్వారా దేశ పురోగతికి తోడ్పడాలన్నారు.