మేడిపల్లిలో ఘనంగా తెలంగాణ దీక్షా దివస్

29-11-2026 | 08:03pm

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.

జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర(Separate Telangana State) సాధన ఉద్యమ చరిత్రలో(History of the Movement) నవంబర్ 29వ తేదీకి విశిష్టమైన స్థానం ఉందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పిన చారిత్రాత్మక ఘట్టమే దీక్షా దివస్(Diksha Divas) అని పీర్జాదిగూడ  మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి(Former Mayor of Peerzadiguda, Jakka Venkat Reddy) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(BRS chief and former Chief Minister KCR) చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని కొనియాడారు.

తెలంగాణ దీక్షా దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం మేడిపల్లిలో జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గమనాన్ని పూర్తిగా మార్చివేసిన చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. 'కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో' అనే నినాదంతో చేపట్టిన దీక్ష ఢిల్లీ పాలకుల మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటిచెప్పిందని పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాగించిన పోరాటం యావత్ తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందన్నారు. తెలంగాణ సాధన కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు చేసిన పోరాటాలు, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు.

అమరవీరుల ఆశయాలను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునే లక్ష్యంతో బీఆర్ఎస్ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, కవిడే పోచయ్య, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుగు మనోరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కోటగిరి శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు ఆకుల మధుకర్, శ్యామల శ్రీనివాస్, మల్లం వెంకటేష్ గౌడ్, మైనార్టీ నాయకులు జిలానీ పాషా, వివిధ డివిజన్ల మాజీ అధ్యక్షులు, యువజన, మహిళా విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు