మూస చిత్రాలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు

20-11-2026 | 05:05am

‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ ‘రాజిగాడు రాజయ్యాడు(Rajigadu Rajayyadu)’ అనే కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్‌పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అను శ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డాక్టర్ గోరటి వెంకన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్న మాట్లాడుతూ.. “చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదాలు కొందరు సృష్టించినవి. కళ అయిన సినిమాకు అలాంటి భేదం లేదు. ఇతర భాషల చిత్రాలు ఆ భేదాలు చెరిపేస్తున్నాయి. తెలుగులో కూడా ఆ మార్పు వస్తుంది. ఈ చిత్ర కథా రచయిత ఎన్నో గొప్ప అర్డులు పొందారు. ఆయన నాటకం నంది పురస్కారాలు పొందింది. అలాంటి గొప్ప కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు అల్తాఫ్. మూస చిత్రాలకు భిన్నంగా అల్తాఫ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రావడం లేదు.

ఒక జీవితాన్ని చూసిన అనుభూతి కలిగిస్తుంది. ఏ ప్రాంతం నేపథ్యంతో వస్తున్న కథైనా మనసును హత్తుకునేలా ఉండాలి. మనసును తాకే ఆ తరహా కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి” అన్నారు. హీరో, డైరెక్టర్ అల్తాఫ్ హసన్ మాట్లాడుతూ.. ‘గొప్ప పర్పస్ ఉన్న ఇన్స్ పైరింగ్ మూవీ ఇది. అంతా మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘అప్పట్లో జయసుధ, విజయశాంతి క్యారెక్టర్స్‌ను డైరెక్టర్ ఎలా డిజైన్ చేశారో.. ఈ చిత్రంలో నా పాత్రను అల్తాఫ్ అలా డిజైన్ చేశారు’ అని నటి అను శ్రీ తెలిపింది.

నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. “ఈ సినిమా నేనే ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి కంప్లీట్ అయ్యేవరకు జరిగే జర్నీ నేను చూశా. దాంతో సినిమాల మీద గౌరవం మరింత పెరిగింది. మా టీమ్ సపోర్ట్ వల్లే అడ్డంకులు దాటుకుని ఇక్కడిదాకా వచ్చాం. సినిమా బాగా వచ్చింది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని తెలిపారు. నటీనటులు సంజయ్ గౌడ్, కేశవ, అశోక్‌రెడ్డి, శివకుమార్ కాముని, విజయ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, విజయలక్ష్మి, వెంకటేశ్, డీవోపీ పీఎస్ మణికర్ణన్, సంగీత దర్శకుడు జగదీశ్ సత్యన్, ఎడిటర్ సతీశ్ రాజా, స్టోరీ రైటర్ డీ విజయభాస్కర్, స్క్రిప్ట్ రైటర్ సూర్యారావు, లిరిసిస్ట్ లక్ష్మణ్, డైలాగ్ రైటర్ రమేశ్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. 


మరిన్ని వార్తలు