మూస పాత్రలకు భిన్నంగా..నచ్చిన కథల్లో విభిన్నంగా..
ఒకే మూసలో ఒదిగిపోదు.. ఒకే ఇమేజ్‌కు పరిమితం కావడానికి ఇష్టపడటం లేదు.. కథ నచ్చితే చాలు, పాత్ర ఏదైనా ఓకే అంటూ సెట్స్‌లో అడుగుపెడుతున్నారు సాయిపల్లవి(Sai Pallavi). ఔను, ఒక నటిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను నిర్మించుకోవడం కంటే, మంచి కథలో భాగం కావడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతి సినిమాలోనూ ఒకే తరహా నటనను పునరావృతం చేయకుండా, కథకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ వచ్చారు.
ఇటీవల జపాన్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ‘ఏక్ దిన్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు సాయిపల్లవి. తాజాగా ‘రామాయణ’లో సీతాదేవిగా కనిపించిన ఆమె.. ధనుష్ ‘ఓం: చాప్టర్ 1’లో పోలీస్ అధికారిణిగా సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూడు పాత్రలకు ఒకదానికొకటి ఎలాంటి పోలిక లేకపోవడమే విశేషం. కమర్షియల్ లెక్కలు, విజయాపజయాల అంచనాల కంటే కథలోని బలాన్ని, పాత్రలోని భావోద్వేగాలను నమ్ముకునే సాయిపల్లవి ప్రయాణం ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారింది.
సాయిపల్లవి కెరీర్‌లో అత్యంత బాధ్యతాయుతమైన పాత్రల్లో సీతాదేవి ఒకటి. భారతీయుల భావోద్వేగాలతో ముడిపడిన పాత్ర కావడంతో ఈ ఎంపికపై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సినిమాలో సాయిపల్లవి నటనను చూసిన తర్వాత చాలా మంది తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
ఆ తర్వాత సీత పాత్ర నుంచి ఒక్కసారిగా యాక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు సాయిపల్లవి. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ‘ఓం: చాప్టర్ 1’లో నిత్యారెడ్డి అనే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారిణిగా కనిపించారు. ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలు, సామాజిక అంశాలతో కూడిన కథల్లో తనదైన ముద్ర వేసిన సాయి పల్లవి.. ఇప్పుడు యాక్షన్ నేపథ్యంలో సాగే పోలీస్ పాత్రలో కనిపించడం విశేషం. విజయవంతమైన ఫార్ములాను అనుసరించకుండా, కొత్త కథల కోసం అన్వేషిస్తూ సాగుతున్న సాయి పల్లవి ప్రయాణం నిజంగా ఆసక్తికరం.