సావు దేవత ఆవులించిందా మీ గావు పడ్తాది..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 27న పలు భాషల్లో రిలీజ్ కానుందీ చిత్రం. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌గా ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రిలీజ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన ఐకానిక్ పాటను రీక్రియేట్ చేశారు.
ఒరిజినల్ పాటకు పనిచేసిన సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మరోసారి ఈ కొత్త వెర్షన్ కోసం కలిశారు. జేక్స్ బిజోయ్ ఈ పాటను -కంపోజ్ చేయగా.. పావని వాస, అశ్విని చెపురి, అభిక్య తనికెళ్ల, వినాయక్, వెంకీ, నాని పాడారు. ఈ గీతానికి ‘సావు దేవత ఆవులించిందా మీ గావూ పడుతాదీ.. ఇంకా సావే.. రప్పారప్పా నరుకుతుంటే శిప్పెడు రక్తంగక్కి హే దురుగా అనుకుంటా బురదల గలిసీ పోవూడే..’ అనే సాకి రోమాలు నిక్కబొడిచేలా ఉంది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ.. “ఈ పాట రీక్రియేట్ అనగానే మనసు లో కొంచెం భయం మొదలైంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఐకానిక్ సాంగ్. దాన్ని రీక్రియేట్ చేయడం చాలా పెద్ద బాధ్యత. మేము ఒరిజినల్‌ను మ్యాచ్ చేయలేం. కానీ ఆ పాటకు న్యాయం చేసేలా మా ప్రయత్నం చేశాం. వందేమాతరం శ్రీనివాస్ పాట పాడటం, సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం రాయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాట విజయశాంతి మేడమ్‌కి ఒక చిన్న ట్రిబ్యూట్” అన్నారు.
వందేమాతరం మాట్లాడుతూ.. “ఈ పాటలో రష్మిక చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పాట థియేటర్లలో గుజ్‌బంప్స్ తెప్పిస్తుంది” అని తెలిపారు. అశోక్ తేజ మాట్లాడుతూ.. “డైరెక్టర్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను మళ్లీ ఇందులో ఆవిష్కరించబోతున్నామని చెప్పినప్పుడు షాక్ అయ్యా. ఈ సినిమాలో రష్మిక అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు గర్జన మాత్రమే వినిపించింది. రేపు సింహం కనిపించబోతోంది” అని చెప్పారు. డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. “29 ఏళ్ల తర్వాత వందేమాతరం, సుద్దాల కాంబోలో ఈ పాట రావడం చాలా విశేషం” అన్నారు. ‘థియేటర్లలో ఈ పాట బ్లాస్ట్ అవుతుంది’ అని అజయ్ చెప్పారు.