ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక ఆదాయం

17-11-2026 | 02:23pm
  1. ఆరుతడి పంటలు, పందిరి కూరగాయల సాగుపై దృష్టి సారించాలి
  2. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ 

కల్వకుర్తి నవంబర్ 17 : రైతులు సంప్రదాయ పంటల సాగుకు(Farmers cultivating traditional crops) ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగంతో అధిక ఆదాయం అందించే ఆరుతడి పంటలు, పందిరి కూరగాయల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్(District Collector Hemant Keshav Patil) సూచించారు. మంగళవారం కల్వకుర్తి మండలంలోని ముకురాల, పంజుగుల , లింగసానిపల్లి గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను పరిశీలించారు.

పంటల సాగు విధానం, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ అవకాశాలు, రైతులకు లభిస్తున్న ఆదాయం తదితర అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముకురాల గ్రామంలో రైతు రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ భూమిలో చేపట్టిన పందిరి కూరగాయలు, చిక్కుడు సాగును కలెక్టర్ పరిశీలించారు. పందిరి సాగులో మొక్కల పెంపకం, పంటల నిర్వహణ, నీటి వినియోగం, దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా లభించే ఆదాయంపై చర్చించారు.

అనంతరం గ్రామంలో సాగు చేస్తున్న బొప్పాయి పంటను పరిశీలించి మొక్కల పెరుగుదల, సాగు ఖర్చులు, దిగుబడులు, మార్కెటింగ్ అవకాశాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. లింగసానిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేలా చొరవ చూపాలని మధ్యాహ్న భోజనం  ప్రమాణాలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు