ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

17-11-2026 | 02:12pm

జెహెచ్ ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటు చేసిన టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభంచిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

షాద్ నగర్ నవంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని(industrial environment) కల్పిస్తూ, పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు(Employment opportunities) కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. షాద్‌నగర్ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కావడానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

మంగళవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని  కొత్తూరు మండలం తిగాపూర్ గ్రామంలో జేహెచ్ ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటు చేసిన టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్  పాల్గొన్నారు.

విమానాలు, ఏరో ఇంజిన్ల తయారీ, నిర్వహణకు అవసరమైన అత్యాధునిక టూల్స్, ఫిక్చర్లను ఈ కేంద్రంలో తయారు చేయనున్నారని,  దిగుమతులపై ఆధారపడిన ఈ రంగంలో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఆధునిక పరిశ్రమల అభివృద్ధికి, స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కల్పనకు ఇటువంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ నియోజకవర్గంలోని తిగాపూర్ గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఏరోస్పేస్ టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కేంద్రం షాద్‌నగర్ పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జేహెచ్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు విశాల్, వెంకటేష్‌తో పాటు సంస్థ బృందానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సంస్థ మరింత అభివృద్ధి సాధించి, షాద్‌నగర్ నియోజకవర్గ పారిశ్రామిక రంగానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి విశేషంగా దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తూర్ మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి,మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్,మాజీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి,అంబటి ప్రభాకర్,సాయిలు,కొర్ర రవి,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు