చేయూత పింఛన్లతో ఆర్థిక భరోసా
- ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో చేరి ఆర్థికంగా ఎదగాలి
- వడ్డీ లేని రుణాలతో ప్రోత్సాహం
- తలసేమియా బాధితులకు సైతం నూతనంగా పింఛన్ల సదుపాయం
- మండలంలోని 18 పంచాయతీల్లో 487 మందికి నూతన చేయూత పింఛన్లు
- పెన్షన్ల మంజూరి ఉత్తర్వులు అందజేసిన మంత్రి సీతక్క
గోవిందరావుపేట, నవంబర్ 17 (విజయక్రాంతి): నిరుపేదలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడంతో పాటు మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం(State Government) అనేక సంక్షేమ కార్యక్రమాలను(welfare programs) అమలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.
మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంట్లో మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని, మహిళలు ప్రతి అవసరానికి ఇతరులపై ఆధారపడకుండా ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల మంజూరులో అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులతో పాటు వివిధ వర్గాలకు చెందిన అర్హులకు పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మహిళా సంఘాల సభ్యులు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని, సంఘాల్లో సభ్యత్వం లేని మహిళలు కూడా చేరి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన మహిళలకు ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చేలా మహిళా సంఘాల ద్వారా 50 వేల నుంచి లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు కేవలం రుణాలే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల సమీపంలో ఇందిరమ్మ క్యాంటీన్లు, టిఫిన్ కేంద్రాల ఏర్పాటుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పెట్టుబడిని రుణాల రూపంలో అందిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న ఉపాధి కార్యక్రమాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తూ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల్లో మొత్తం 487 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ రవీందర్ రెడ్డి, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.