టెస్టు సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్

17-11-2026 | 02:24pm

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కివీస్‌కు షాక్.. శాంట్నర్ ఔట్!

స్పోర్ట్స్ డెస్క్: భారత్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్(Star all-rounder Mitchell Santner) గాయంతో రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి కుడిచేతికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో జట్టు నుంచి తప్పించారు.

భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శాంట్నర్ చేతికి గాయమైంది. అనంతరం నిర్వహించిన స్కానింగ్‌లో ఫ్రాక్చర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో అతడు ఆడే అవకాశం లేకుండా పోయింది.

శాంట్నర్ స్థానంలో ఫాక్స్‌క్రాఫ్ట్

శాంట్నర్ స్థానంలో 28 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌(Spin bowling all-rounder Dean Foxcroft)కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టులో చోటు కల్పించింది. గతంలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన ఫాక్స్‌క్రాఫ్ట్ తన తొలి మ్యాచ్‌లోనే 98 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కింది.

ఆస్ట్రేలియా సిరీస్‌పై అనిశ్చితి

శాంట్నర్ గాయం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయంపై వైద్య బృందం అంచనా వేస్తోంది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

ఈ నెల 19 నుంచి తొలి టెస్టు

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్‌లో జరగనుంది. గతంలో 2024లో భారత గడ్డపై టీమిండియాను 3-0తో ఓడించిన న్యూజిలాండ్ మరోసారి అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అయితే కీలక ఆల్‌రౌండర్ శాంట్నర్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటుగా మారింది.

మరిన్ని వార్తలు