‘హైజాక్’ హెచ్చరిక.. అత్యవసర ల్యాండింగ్
- ఎయిర్ ఇండియా విమానంలో కలకలం
- పైలెట్ అలర్ట్ కోడ్ను పంపినట్లు నిర్ధారణ
- పూర్తి ఘటనపై దర్యాప్తు చేపట్టిన డీజీసీఏ
జైపూర్, అక్టోబర్ 14: ఎయిర్ ఇండియా విమానం(Air India aircraft) నుంచి ‘స్వాక్ 7500’ హైజాక్ కోడ్ను(Hijack code) రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి రావాల్సి ఉండగా ఎమర్జెన్సీ కోడ్ అందడంతో విమానాన్ని జైపూర్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం మంగళవారం రాత్రి 9.45 గంటలకు ఎయిర్ ఇండియా ఎఐ-2030 విమానం ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది.
ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ విమానం నుంచి అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(Ahmedabad Air Traffic Control) (ఏటీసీ)కి ఎమర్జెన్సీ కోడ్ అందింది. దీంతో ఏటీసీ భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసింది. వెంటనే విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి నాలుగు గంటలపాటు అనువణువూ తనిఖీలు చేపట్టారు. విమానంలో ఏం లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అలర్ట్ కోడ్ను పైలెట్ పంపినట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. విమానాన్ని మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ఢిల్లీకి పంపించారు.