అధికారికంగా ఎమర్జెన్సీ విధించండి

15-10-2026 | 05:10am

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా నేరమా? 

సీజేపీ ఇద్దరు నేతలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీపై ఆ పార్టీ నేత అభిజీత్‌దీప్కే తీవ్ర ఆగ్రహం 

జంతర్‌మంతర్ ప్రజలది.. తిరిగి నిరసన ప్రాంతంగా సాధిస్తాం 

సీజేపీకి మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. ధన్యవాదాలు తెలిపిన దీప్కే 

పోలీసుల తీరు అత్యంత హాస్యాస్పదం: ఢిల్లీ మాజీ సీకేం కేజ్రీవాల్

న్యూఢిల్లీ/నాగ్‌పూర్, అక్టోబర్ 14: నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం ‘అనధికారిక అత్యవసర పరిస్థితి’ని విధిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party)(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijit Deepke) ఆరోపించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించాలనుకుంటే, దానిని అధికారి కంగా చేయండని ఆయన స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా సీజేపీ నాయకులు(CJP leaders) సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా చేసిన నేరం ఏమిటని దీప్కే ప్రశ్నించారు.

న్యూఢిల్లీలో డీనోటిఫై చేసిన జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై ఇద్దరు సీజేపీ నాయకులను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించి, వారిని తీహార్ జైల్‌కు పంపిన తర్వాత అభిజీత్ దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదని, జంతర్‌మంతర్ ప్రజలది అని, దీనిని తిరిగి నిరసన ప్రాంతంగా సాధించుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సీజేపీనేతల అరెస్ట్‌పై ఆయ న స్పందిస్తూ... వారికి మద్దతు తెలిపారు.

జాతీయ జెండాను ఊపడం నేరమా? పోలీసుల తీరు అత్యంత హాస్యాస్పదంగా ఉందని సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. సీజేపీ నేత అభిజీత్‌దీప్కే నాగ్‌పూర్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను నరేంద్ర మోదీకి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించాలనుకుంటే, దానిని అధికారికంగా చేయం డి’ అని అన్నారు.

‘ఇదేమిటి, ఇంత దిగజారి ప్రవర్తిస్తూ, కేవలం జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపినందుకు ప్రజలను (సీజేపీ నేతల అరెస్ట్‌ను ఉద్దేశించి) ఐదు రోజుల పాటు కస్టడీలో ఉంచి అనధికారిక అత్యవసర పరిస్థితిని విధిస్తున్నారా? (1975లో ఇందిరా గాంధీ విధించిన) అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఇలా జరగలేదు’ అని ఆయన తెలిపారు. ఈ దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం అత్యంత ఘోరమైన పాపంగా మారిందని, దానికోసం ప్రజలను జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నారని దీప్కే ఆరోపించారు.

‘నేను నరేంద్ర మోదీకి చెప్పేది ఏంటంటే, ఇంత దుర్మార్గంగా వ్యవహరించకండి. కాస్త ధైర్యం చూపించండి. మీరు ఎమర్జెన్సీ విధించాలనుకుంటే, అధికారికంగా విధించండి’ అని ఆయన సవాల్ విసిరారు. తరువాత దీప్కే, ‘ధమ్మ చక్ర ప్రవర్తన్ దినోత్సవం’ సందర్భంగా నాగ్‌పూర్‌లో దీక్షాభూమిని సందర్శించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ‘మన దేశం రాజ్యాంగం మీద నడుస్తుంది. ఈ దేశంపై ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని రుద్దడానికి నరేంద్ర మోదీ గానీ, మరెవరైనా గానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అది జరగదు’ అని దీప్కే స్పష్టం చేశారు. 

జంతర్‌మంతర్ ప్రజలది: రాహుల్

జంతర్‌మంతర్ వద్ద నిరసన చేసిన సీజేపీ నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మద్దతు తెలిపారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనగా త్రివర్ణ పతాకం ఎగురవేయడం నేరం కాదని, దానికోసం యువకులను జైలులో పెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు. జంతర్ మంతర్ భారత ప్రజలకు చెందినదని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం అందరి బాధ్యత. జంతర్‌మంతర్‌ను తిరిగి నిరసన ప్రదేశంగా సాధిం చుకుంటాం’అని స్పష్టం చేశారు. ఈ మేరకు రాహుల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. రాహుల్ పోస్టుపై సీజేపీ నేత దీప్కే స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.

తీహార్ జైల్‌లో సీజేపీ నేతలు

నిరసనల కోసం డీనోటిఫై చేసిన జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, శాంతిభద్రతలను కాపా డతామని పెట్టిన బాండ్లను ఉల్లంఘించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్‌రాంకాలకు ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

వారి సహచరుడు అజింక్య షిండేను ఆరు నెలల పాటు శాంతిభద్రతలు, సత్ప్రవర్తన పాటిస్తామని హామీ పత్రంపైసంతకంతో, రూ.5వేల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వారిని బెయిల్‌పై విడుదల చేస్తే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించి, ఇతరులను రెచ్చగొడతారనే తీవ్ర సందేహాలను పరిగణనలోకి తీసుకుని, దాస్, రాంకాను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా, ఐదురోజు ల జ్యూడిషియల్ కస్టడీ విధించి, వారిని  తిహార్ జైలుకు తరలించారు. 

మరిన్ని వార్తలు