రష్యా చమురుతో భారత్ గ్లోబల్ గేమ్
ముడి చమురు అవసరాల్లో అధిక శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్.. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో మాత్రం ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గించుకుంటుండగా, భారత్ మాత్రం రిఫైనరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. దీంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారత్ వ్యూహాత్మకంగా బలపడుతోంది. ఈ అంశాలను ‘ఇండియా నెరేటివ్’ కథనం వివరించింది.
2026 ఏప్రిల్ నాటికి భారత్ చమురు శుద్ధి సామర్థ్యం ఏడాదికి 267.1 మిలియన్ టన్నులకు చేరింది. రోజుకు సుమారు 53 నుంచి 56 లక్షల బ్యారెళ్లకు సమానమైన ఈ సామర్థ్యంతో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, రష్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలంలో 400 మిలియన్ టన్నులకు చేర్చాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విస్తరణతో భారత్ అంతర్జాతీయ Oil Refining రంగంలో మరింత కీలకంగా మారనుంది.
ప్రస్తుతం భారత్ రోజుకు 54 నుంచి 56 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇందులో రష్యా నుంచి వచ్చే చమురు వాటా ఇటీవల 18 నుంచి 20 లక్షల బ్యారెళ్లుగా ఉంది. అంటే మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 35 శాతంగా ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ వాటా 50 శాతాన్ని కూడా దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, ఇతర పరిస్థితులను బట్టి భారత్ చమురు కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకుంటోందని కథనం పేర్కొంది.
మరోవైపు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు భారత్‌కు భారీ ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో వీటి ఎగుమతుల విలువ 27.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో డీజిల్ వాటా 12.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్ నెలలో భారత్ రోజుకు సుమారు 6.2 లక్షల బ్యారెళ్ల డీజిల్‌ను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో దాదాపు సగం ఐరోపా దేశాలకు చేరింది.
రష్యా ఉత్పత్తులపై ఆంక్షలు, ఐరోపాలో కొన్ని రిఫైనరీల మూసివేత, మధ్యప్రాచ్య దేశాల్లో నిర్వహణ పనుల కారణంగా ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ నుంచి జరుగుతున్న ఎగుమతులు ఆ కొరతను కొంతవరకు భర్తీ చేస్తున్నాయి. దీంతో భారత Petroleum Exports కు అంతర్జాతీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా ఆంక్షలు, సుంకాల ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ, భారత రిఫైనరీల్లో శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తులు ప్రపంచ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగిన సందర్భాల్లో అమెరికా సైతం కొన్ని ఆంక్షల విషయంలో మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని కథనం ప్రస్తావించింది.
భారత్ చమురు శుద్ధి సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరా, ధరల సమతుల్యతపై ప్రభావం చూపగల స్థాయికి చేరుకుంటుందని విశ్లేషించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతున్నప్పటికీ, శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులతో ప్రపంచ దేశాలకు సరఫరాదారుగా ఎదగడం భారత్‌కు వ్యూహాత్మకంగా కలిసివస్తోంది. భవిష్యత్తులో Global Energy Market లో భారత్ పాత్ర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.