సత్తాచాటిన ఇండో-అమెరికన్లు
వాషింగ్టన్, నవంబర్ 4: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో(US midterm elections) ఇండో-అమెరికన్లు (భారత సంతతి వ్యక్తులు) సత్తా చాటారు. ఈ విజయంతో పలువురు చరిత్ర సృష్టించగా, పలువురు అమెరికన్లలో తమ స్థానాన్ని మరింత పదిలపర్చుకున్నారు. కాగా గెలిచిన వారిలో డెమోక్రాటిక్ చెందిన ఇండో అమెరికన్లుండగా, పలువురు ఓటమి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.
వరుసగా ఆరోసారి ప్రమిలా..
భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ నాయకురాలు ప్రమిలా జయపాల్ వాషింగ్టన్‌లోని ఏడో పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించారు. ఈమె యూఎస్ కాంగ్రెస్ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో పనిచేసిన తొలి భారతీయ- అమెరికన్ మహిళ. చెన్నైలో జన్మించిన ప్రమిలా అనంతరం అమెరికాకు వలస వచ్చారు. 2016లో తొలిసారిగా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. వలసదారుల హక్కులు, మెరుగైన ఆరోగ్యం, మహిళల హక్కులు, పలు సమస్యలను లేవనెత్తుతూ తనకంటూ అమెరికన్ ప్రజల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
టాండన్‌ను ఓడించిన రోఖన్నా..
కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత సంతతికి చెందిన రోఖన్నా డెమోక్రాటిక్ తరఫున పోటీలో దిగి రిపబ్లికన్ పార్టీకి చెందిన రితేశ్ టాండన్‌ను ఓడించి విజయాన్ని కైవసం చేసుకున్నాడు. రోఖన్నాకు ఇది వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. 2017నుంచి యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యుడిగా రోఖన్నా ఉన్నారు. చైనా విధానాలు, సాంకేతికత, వాణిజ్యం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు.
వివేక్ రామస్వామికి ఎదురుదెబ్బ
రిపబ్లికన్ పార్టీ తరఫున ఒహాయో రాష్ట్ర గవర్నర్ బరిలో దిగిన భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ విజయం సాధించారు. రామస్వామి 2024 రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించగా అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. అనంతరం ట్రంప్‌నకు పూర్తి మద్దతు ప్రకటించారు. కాగా ఈయన తరఫున స్వయంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ప్రచారంలో నిలిచినా ఓటమి పాలయ్యారు.
సరితా కోమటిరెడ్డికి తప్పని నిరాశ
న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం పోటీపడిన తెలుగు మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమి పాలయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో డెమోక్రటిక్ అభ్యర్థి లెటిటియా జేమ్స్‌పై పోటీకి దిగారు. ఓటమి అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటమిని స్వీకరిస్తున్నానని ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. ఈమె కుటుంబం దశాబ్దాల క్రితమే తెలంగాణ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. బ్రూక్లిన్‌లో జన్మించిన సరితకు న్యాయవృత్తిలో అపార అనుభవం ఉంది.