గర్భిణి జర్నలిస్ట్‌ను నెట్టిన రాహుల్?

14-10-2026 | 05:05am
  1. ఆరోపిస్తూ వీడియో పంచుకున్న మహిళా విలేకరి
  2. బీజేపీ నేతల ఆగ్రహం.. ఆసుపత్రిలో పరామర్శ
  3. పోరాటాన్ని దెబ్బతీసేందుకే ఆరోపణలు: కాంగ్రెస్ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సర్‌కు వ్యతిరేకంగా విపక్షాలు నిర్వహించిన నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సమయంలో తనను నెట్టేశారని జర్నలిస్ట్ రిచా పరాశర్(Journalist Richa Parashar) ఆరోపించారు. మూడు నెలల గర్భిణీగా ఉన్న తనని రాహుల్ నెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరానన్నారు. రిచా పరాశర్ మంగళవారం ఈ ఘటనపై వివరాలందించారు. సుప్రీంకోర్టు గేటు వద్ద రాహుల్ గాంధీ బయటకు వచ్చే సమయం కోసం ఎదురుచూశానని, మైక్‌ను పక్కకు జరపమని సైగ చేయడంతో నేను వెనక్కి తీసుకున్నానని చెప్పారు.

కానీ ఇతర జర్నలిస్టులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారని, నా విధుల్లో భాగంగా నేను కూడా రాహుల్‌తో మాట్లాడేందుకు ముందుకు వచ్చి ప్రయత్నిం చానన్నారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రాహుల్ గాంధీ అసహనంతో ముందుకు వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగేశారని, ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా తనను నెట్టివేశారని తాను మెట్లపై బోర్లా పడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా రిచా పరాశర్ పోస్ట్ చేశారు.

బీజేపీ నేతలు ప్రదీప్ భండారీ, ఉమంగ్ బజాజ్‌లు రిచా పరాశర్‌ను పరామర్శించారు. మహిళా సాధికారత గురించి, పితృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్ట్ పట్ల ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆమె గర్భిణి అని చెప్పినా కింద పడేయడం దారుణమన్నారు. జర్నలిస్ట్ ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు తీవ్రంగా ఖండించారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఘటన స్పష్టంగా లేదన్నారు. ఆరోపణలు నిరాధారమన్నారు. ప్రతిపక్షాల పోరాటాన్ని దెబ్బతీసే ప్రయత్నమని కొట్టిపడేశారు.

మరిన్ని వార్తలు