కల్తీ మద్యం కాటుకు 15మంది మృతి
- 180మంది ఆసుపత్రిపాలు
- అధికారులపై మణిపూర్ సీఎం యుమ్నం ఆగ్రహం
- బీజేపీ నిర్లక్ష్యమే కారణమని రాహుల్‌గాంధీ ఆగ్రహం
ఇంఫాల్, నవంబర్ 21: మణిపూర్‌లో కల్తీ మద్యం(Adulterated liquor) సేవించి 15 మంది మృతి చెంద గా, 180 మందికి పైగా ఆసుపత్రి పాలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్(CM Yumnam Khemchand Singh) అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని పోలీసు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం యుమ్నం ఇంఫాల్‌లోని జేఎన్‌ఐఎంఎస్, రిమ్స్, షిజా, బబినా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం పరామర్శించారు.
మెరుగైన చికిత్సలు అందజేయాలని వైద్యులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చందేల్ జిల్లాలోని చక్పికరోంగ్ ప్రాంతంలో గత మూడు రోజులుగా పలువురు మద్యం సేవించి తీవ్ర అస్వస్థతకు గురవడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చందేల్ పోలీస్ సూపరింటెండెంట్ ధర్మేంద్ర కుమార్ త్యాగి అన్నారు. బాధితులను ఆస్పత్రుల్లో చేర్చామ న్నారు. 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మృతుల సంఖ్య 15గా నమోదైందని, 180కుపైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లాలో మద్యం తాగవద్దని హెచ్చరికలు జారీ చేశామని, మద్యం శాంపుళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామన్నారు. మిథనాల్ ప్రభావానికి గురై ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. చందేల్‌కు మద్యం కాక్చింగ్ జిల్లా సుగ్ను అనే ప్రాంతం నుంచి తీసుకొచ్చారని గుర్తించామన్నారు. తదుపరి విచారణను సుగ్ను పోలీసులు చేపట్టారని వివరించారు. ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశామని త్యాగి వివరించారు.
ఈ ఘటన నేపథ్యంలో బిష్ణుపూర్, సేనాపతి, కక్చింగ్, తౌబల్ జిల్లా యంత్రాంగాలు స్థానికంగా తయారు చేసిన మద్యం సేవించొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రులలో 600మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఘటనను చిన్నదిగా చూపేందుకు, తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2026లో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో కల్తీ మద్యం సేవించి మృతిచెందిన వారి సంఖ్య 120కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో 51, మహారాష్ట్రలో 22, నాగాలాండ్‌లో 19, మణిపూర్‌లో 16, గుజరాత్‌లో 13, బిహార్‌లో 5మంది ప్రాణాలు కోల్పోయారు.
బీజేపీ అసమర్థత వల్లే మృతి..
బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్లే మణిపూర్‌లో కల్తీ మద్యానికి బలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలపై తాము పోరాటం చేస్తుంటే దీన్ని బీజేపీ ప్రభుత్వం హింసాకాండతో పోలుస్తుందని ఆరోపించారు. వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.