ఎన్నికల కమిషనర్లను ప్రలోభ పెట్టిందే మీరు
- విధేయతకు లంచంగా పద్మా అవార్డులు, పదవులు ఇవ్వలేదా?
- అందుకు ఎంఎస్ గిల్, ఆర్కే త్రివేది ప్రస్తానమే మచ్చు తునక
- కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం
- ఒక ముఖ్యమంత్రి కాలర్ పడ్తావా? నీకెంత ధైర్యం?
- రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత ధ్వజం
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: కాంగ్రెస్ హయాంలోనే ఈసీ దుర్వినియోగం అయిందని, పదవీ విరమణ చేసిన అధికారులకు రాజకీయ పదవులు(Political positions) కట్టబెట్టలేదా? పద్మ అవార్డులను ఇవ్వలేదా? మాజీ ప్రధాన ఎన్నికల కమిషన్(Former Chief Election Commissioner) ఎం.ఎస్ గిల్ కేంద్ర కేబినెట్ వివిధ హోదాల్లో పనిచేయలేదా? అది లంచం కాదా? అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) విరుచుకుపడ్డారు. రాజకీయ బేరసారాలకు నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ అని అభివర్ణించారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై(CEC Gyanesh Kumar) కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, నిరసనల నేపథ్యంలో కేంద్రమంత్రి న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు ప్రశ్నలను సంధించారు. టీఎన్ శేషన్ పదవీకాలం ముగియగానే కేవలం రెండు నెలల్లోనే గుజరాత్ గవర్నర్‌గా నియమితులయ్యారని గుర్తు చేశారు. 2005లో నవీన్ చావ్లాను ఎన్నికల కమిషనర్‌గా నియమించడం వెనుక సోనియాగాంధీ హస్తం లేదా? అని నిలదీశారు. 2009లో అప్పటి సీఈసీ ఎన్.గోపాలస్వామి, నవీన్ చావ్లాను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను గుర్తుకు తెచ్చారు.
నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సైతం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏనాడైనా కనీస గౌరవం, మర్యాద ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్ గిల్ సీఈసీగా ఉన్నప్పుడు ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం లంచం కాదా? అని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ద్వంద్వ ప్రమాణాలు, పిల్ల చేష్టలను దేశ ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్న రాహుల్ తమ హయాంలో గత రికార్డులను మరిచిపోయారా? అని ప్రశ్నించారు.
ఓట్ల దొంగతనం ఆరోపణలపై రాహుల్ గాంధీ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని? బీహార్‌లో ఎస్ఐఆర్లో ఎందుకు మౌనంగా ఉన్నారని? ఎన్నికల కమిషనర్ల నియామకంపై ప్రశ్నలు ఎందుకు లేవదీస్తున్నారని, మీ హయాంలో నియామకాలపై ఎవరితోనైనా సంప్రదించారా? ఎన్నికల్లో గెలిచిన రాష్ట్రాల్లో బాగా పనిచేస్తుందని, ఓడిపోతే ఎస్ఐఆర్లో రిగ్గింగ్ జరిగిందని ఎలా ద్వంద్వ విధానాలు ప్రదర్శిస్తారని నిలదీశారు.
పదేపదే అబద్ధాలు చెప్పడం వల్ల కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని ఎన్నటికీ గెలుచుకోలేదన్నారు. కాంగ్రెస్ కమిటీలో కేరళ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీకారామ్ మీనాను ఎందుకు చేర్చారని? యు. రతన్ కేల్కర్‌ను సీఎం కార్యదర్శిగా ఎందుకు నియమించారని, మమతా బెనర్జీ విషయంలో అసలు కాంగ్రెస్ వైఖరి ఏమిటీ? ఎందుకు పశ్చిమ బెంగాల్లో ఆమెపై పోటీ చేశారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీకేఎస్ తలవంచుతారా?..
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాలర్ పట్టుకుని లాగుతున్న వీడియోను షేర్ చేసి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనను ‘బహిరంగ అవమానం’గా అభివర్ణిస్తూ, కర్ణాటక నాయకుడు దీనిని అంగీకరిస్తారా? అని నిలదీశారు. రాష్ట్రానికి ప్రతినిధి డీకేఎస్ బహిరంగ అవమానానికి తలవంచుతారా? అని ప్రశ్నించారు. 2015లో, ఒక గర్వించదగిన అస్సామీగా నేను అవమానాన్ని దిగమింగడానికి నిరాకరించానన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కేవలం ఒక వ్యక్తి కాదని రాజ్యాంగబద్ధమైన పదవి, ఘనమైన చరిత్ర, గొప్ప సంస్కృతి కలిగిన రాష్ట్రానికి ప్రతినిధి అని అన్నారు. సీఎం కాలర్ పట్టుకుంటావా? నీ కెంత ధైర్యం అంటూ రాహుల్ గాంధీపై హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.