ఆ ముగ్గురి మధ్య మోదీ ఎక్కడ?

21-11-2026 | 05:15am

కాంగ్రెస్ అధికారంలో ఉంటే తప్పకుండా భారతదేశ ప్రధాని అక్కడ ఉంటుండె

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ ఫొటోను ట్వీట్ చేస్తూ రాహుల్ కామెంట్

న్యూఢిల్లీ, నవంబర్ 20: అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) తీరు వల్ల భారత్ ప్రాధాన్యం తగ్గిపోతున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. చైనా వేదికగా అమెరికా, రష్యా, చైనా దేశాల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాల అధ్యక్షులు ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదిక మీద కూర్చొని మాట్లాడుకుంటున్నప్పటి ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. భారత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మాత్రం ఆ ముగ్గురి మధ్య భారత ప్రధానమంత్రి తప్పకుండా ఉండేవారని అందులో రాహుల్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ ముగ్గురి మధ్య మన ప్రధాని మోదీ లేకపోవడానికి కారణం ఆయన ఇతర దేశాల ముందు రాజీపడటమేనని దుయ్యబట్టారు. 

గుత్తాధిపత్యం కొలువులివ్వదు!

విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, అడవులు, విద్యుత్, బొగ్గు, రహదారులు.. ఇలా అన్నింటినీ తమ దోస్తులకు మోదీ కట్టబెడుతున్నారని, ఆ దోస్తులను ఉద్యోగాల గురించి ప్రశ్నించకుండా ఇతర సంస్థలను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందంటూ రాహుల్ గాంధీ మరో ట్వీట్ చేశారు. గురువారం ఫిక్కీ శతాబ్ది వేడుకల్లో మోదీ మాట్లాడుతూ.. ‘మేం పన్నులు తగ్గించాం.. అయినా మీరు జీతాలు పెంచలేదు.. ఉద్యోగాలు సృష్టించడం లేదు’ అని మండిపడ్డారు. దీనిపై రాహుల్ తాజాగా ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. 

శాంతి చర్చల్లో పాక్.. ఇండియా సైలెంట్

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడి చికాగో యూనివర్సిటీలో జరిగిన చర్చాగోష్టిలో ప్రశ్నలకు బదులిచ్చారు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తూ పాకిస్తాన్ బిజీగా ఉందని, ఇండియా మాత్రం సైలెంట్‌గా సైడ్ ప్లేయర్‌గా ఉండిపోయిందని, ఇది తనను షాక్‌కు గురిచేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ వల్ల అంతర్జాతీయ వేదికల్లో భారత ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతున్నదని అన్నారు.

‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు ఫ్రెండ్స్ అని ప్రధాని మోదీ చెప్తుంటారు. అంత స్నేహం ఉంటే శాంతి చర్చల్లో ఆయన పాత్ర ఎక్కడ? ఇక్కడ వ్యక్తిగత స్నేహం ముఖ్యం కాదు.. ప్రపంచంలో భారత్ పాత్ర ఏమిటన్నదే ముఖ్యం’ అని రాహుల్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతివ్వడం, ప్రోత్సహించడం ఆపనంత వరకు పాకిస్తాన్‌తో భారత్ చర్చలు ఉండబోవని ఆయన తేల్చిచెప్పారు. 

రాహుల్ పాక్ ఫ్యాన్: బీజేపీ

ఇతర దేశాల్లో పర్యటిస్తూ భారత్‌ను, ఇక్కడి వ్యవస్థలను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని బీజేపీ మండిపడింది. అమెరికాలో పర్యటిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు అనుకూలంగా రాహుల్ మాట్లాడారని.. ఆయన ఎప్పటికీ పాక్ ఫ్యాన్ బాయ్‌నే అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ వ్యాఖ్యానించారు.

ఇతర దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు భారత్ పోషిస్తున్న పాత్ర రాహుల్‌కు కనిపించడం లేదని, రష్యా మధ్య భారత్ చేపట్టిన శాంతి చర్చలు ఆయన దృష్టికి రాకపోయి ఉండొచ్చని విమర్శించారు. ఇక.. ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ సమావేశ వేదికలో ప్రధాని మోదీ కనిపించలేదని రాహుల్ విమర్శించడంపైనా బీజేపీ నేతలు మండిపడ్డారు. మూడు దేశాల మధ్య జరిగే సమావేశంలో భారత్ లేకపోవడం ఏమిటని రాహుల్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది?’ అని బీజేపీ విమర్శించింది.  

మరిన్ని వార్తలు