calender_icon.png 8 July, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల అభివృద్ధికి రూ.700 కోట్లు

08-07-2025 01:29:48 AM

  1. ప్రతి పాఠశాలకు క్రీడా కిట్లు మంత్రి వాకిటి శ్రీహరి
  2. హుస్నాబాద్‌కు స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటన

హుస్నాబాద్, జూలై 7 : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని  క్రీడలు, యువజన సర్వీసులు, డైరీ, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇందుకోసం రూ. 600 నుంచి రూ.700 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించామని  ప్రకటించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తొలి మంత్రివర్గ సమావేశంలోనే క్రీడా పాలసీని ప్రకటించి, రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించి రాష్ట్రానికి విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనేదే తమ లక్ష్యమని  ఉద్ఘాటించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మినీ స్టేడియాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి సందర్శించిన సందర్భంగా మంత్రి శ్రీహరి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

క్రీడా సౌకర్యాలపై స్థానిక క్రీడాకారులు, విద్యార్థులతో మాట్లాడి, వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడల పట్ల హుస్నాబాద్ విద్యార్థులు, యువత చూపుతున్న అపారమైన ఆసక్తిని గమనించిన మంత్రి శ్రీహరి, సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు హుస్నాబాద్ పట్టణానికి స్విమ్మింగ్ పూల్ను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు క్రికెట్, వాలీబాల్ వంటి అన్ని రకాల స్పోరట్స్ కిట్లను అందిస్తామని తెలిపారు. ‘సాధారణ కృషి సరిపోదు, క్రీడలే శ్వాసగా భావించి నిరంతరం సాధన చేస్తేనే అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం సాధ్యం. క్రీడాకారులుగా ఎదగడానికి అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తుంది. 13, 14, 15 సంవత్సరాల నుంచే కఠినంగా శ్రమిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదుగుతారు‘ అని మంత్రి శ్రీహరి పిలుపునిచ్చారు.

హుస్నాబాద్ క్రీడలకు పెట్టింది పేరు : మంత్రి పొన్నం ప్రభాకర్

 రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం క్రీడలకు పెట్టింది పేరు అన్నారు. కబడ్డీ, ఖో-ఖో వంటి క్రీడలతో పాటు ఇతర క్రీడల్లోనూ అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఈ ప్రాంతం అందించింది అన్నారు. ప్రతి గ్రామంలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామని, వాటిని స్థానిక విద్యార్థులు, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈత నేర్చుకోక వాగులు, చెరువుల్లో పడి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరగకుండా ఉండేందుకు హుస్నాబాద్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేయాలని, క్రీడా సౌకర్యాలను మెరుగుపరచాలని మంత్రి శ్రీహరిని కోరారు.

క్రీడా సౌకర్యాలు మెరుగుపడ్డాయి : శివసేనారెడ్డి

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ గతం కంటే ప్రతి నియోజకవర్గంలో క్రీడా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. పిల్లలను చిన్ననాటి నుంచే క్రీడలలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు.

వనమహోత్సవం, కబడ్డీలో మంత్రుల ఉత్సాహం

అనంతరం మినీ స్టేడియం ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్లు తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీహరి అన్నారు.

వనమహోత్సవం ద్వారా జిల్లాలోని ప్రజలందరూ వారి వారి తల్లుల పేరు మీద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కబడ్డీ కోర్టులో క్రీడాకారులను పరిచయం చేసుకున్న మంత్రులు, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ సోనీ బాలాదేవి కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కబడ్డీ కోర్టుకు రెండు మ్యాట్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.