08-07-2025 01:28:28 AM
భద్రాద్రి కొత్తగూడెం,జులై 7, (విజయ క్రాంతి); తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి తమ చదువులు కొనసా గిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన సుమారు రూ.8 వేల కోట్ల చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని పి డి యస్ యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ మండిపడ్డారు.
పి డి యస్ యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను,ఫీజు పథకాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులను కేటాయించి వి ద్యార్థులను సమస్యల వలయంలోకి నెట్టి రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగారిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు నిలిపివేయడంతో విద్యార్థులు అప్పులు చేసి తమ చదువులను కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలాంటి ఫీజు నియంత్రణ లేకుండా ఫీజులను విచ్చలవిడిగా తీసుకుంటూ కోట్ల రూపాయలు కొందరు దండుకుంటున్నారని, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రైవేటు విద్యాసంస్థలు ఎల్ కేజీ,యూకేజీ విద్యకు లక్షల రూపాయలు విచ్చలవిడిగా వసూలు చేయడం, పుస్తకాలు, టై, బెల్ట్, యూనిఫాంలో పేరుతో వ్యాపారాలు జోరుగా కొనసాగిస్తున్నా విద్యా శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండి పడ్డారు.
తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏవో రామకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు మునిగేల శివ, భానోత్ నరేందర్,ఎ. పార్థసారధి, అబ్దుల్ గని, అఖిల్, శ్రావణి,భార్గవి తదితరులు పాల్గొన్నారు.