08-07-2025 02:46:51 PM
హైదరాబాద్: గచ్చిబౌలిలో(Gachibowli) నిర్మాణంలో ఉన్న భవనంలో మంగళవారం ఒక సెక్యూరిటీ గార్డు(Security Guard) హత్యకు గురయ్యాడు. బాధితుడిని జగద్గిరిగుట్ట నివాసి దాసరి రాజు (58)గా గుర్తించారు. అతను గచ్చిబౌలి ఫ్లైఓవర్(Gachibowli Flyover) సమీపంలోని నిర్మాణ స్థలంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం, గత ఏడాది కాలంగా శ్రీ గరుడ ఏజెన్సీ ద్వారా ఆ స్థలంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజు, సోమవారం అర్ధరాత్రి విధుల్లో ఉండగా గుర్తు తెలియని దుండగులు అతని తలపై ఇనుప రాడ్ తో దాడి చేశారు.
మంగళవారం పనికి వచ్చిన కార్మికులు నిర్మాణ స్థలంలోని బేస్‌మెంట్ (బీ3 లెవెల్)లో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలతో సెక్యూరిటీ మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police), క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల నుంచి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగులను గుర్తించి అరెస్టు చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.