calender_icon.png 3 November, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో 60వ ఐజీఎఫ్‌ఆర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్

03-11-2025 02:12:13 AM

ప్రారంభించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్, నవంబర్ 2: గోల్ఫ్ హబ్‌గా మారుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి వేదికైంది. 60వ ఐజీఎఫ్‌ఆర్ ప్రపంచ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. వారం రోజులు పాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. రోటరీ క్లబ్, ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రొటారియన్స్ సహకారంతో దీనిని నిర్వహిస్తోంది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీ క్లబ్, వూటీ గోల్ఫ్ కౌంటీలలో ఈ పోటీలు జరుగుతాయి. దేశంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు, ఆతిథ్యం వంటి వాటిని విదేశీ గోల్ఫర్లకు అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు.

ఈ చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీల్లో పాల్గొంటున్న గోల్ఫర్లకు శుభాకాంక్షలు చెప్పారు. ఇంత పెద్ద అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం తెలంగాణకు రావడం సంతోషంగా ఉందన్నారు. టూరిజం అభివృద్ధి క్రీడలతోనూ ముడిపడి ఉంటుందని, విదేశీ పర్యాటకులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఐజీఎఫ్‌ఆర్ ప్రెసిడెంట్ బాబ్ బ్లమ్‌ను ఆయన సత్కరించారు.