03-11-2025 01:05:00 PM
హైదరాబాద్: బస్సు ప్రమాద ఘటనపై చేవెళ్ల పోలీసులు(Chevella Police) కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు చేవెళ్లలోనే శవపరీక్షలు నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ తెలిపారు. శవపరీక్ష పూర్తయిన మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని సీపీ వెల్లడించారు.
బస్సు, టిప్పర్ డ్రైవర్ల మృతితో తప్పు ఎవరిదనేది ఇప్పుడే చెప్పలేమని సీపీ తెలిపారు. బస్సును ఢీకొనడంతో టిప్పర్ లోని కంకర బస్సులో పడిందని ఆయన వివరించారు. కంకర ఒక్కసారిగా పడటంతో మృతుల సంఖ్య పెరిగిందని సైబరాబాద్ సీపీ వెల్లడించారు. చేవెళ్ల మండలం మీర్జా గూడ రహదారిపై గుంతను తప్పించబోయి కంకర టిప్పర్ బస్సును ఢీకొట్టింది. మృతుల్లో ఎక్కువగా తాండూరు వాసులు, వలస కూలీలు, ఉద్యోగులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. బీజాపూర్ హైవేపై తాండూర్, వికారాబాద్ నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు శంకర్పల్లి మీదుగా దారి మళ్లిస్తున్నారు.