calender_icon.png 31 December, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిండి ఎత్తిపోతల భూసేకరణ, పునరావాసం వేగవంతం చేయాలి

31-12-2025 02:11:43 PM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

కల్వకుర్తి: డిండి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ, పునరావాస (ఆర్ అండ్ ఆర్ ) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పునరావాస కేంద్రాల ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. ప్యాకేజీ–1లో 995.39 ఎకరాలు, ప్యాకేజీ–2లో 2144.16 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తయిందని, మిగిలిన 51 ఎకరాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తీసుకుందని భూసేకరణ, పునరావాస పనుల్లో జాప్యం సహించబోమని స్పష్టం చేశారు. నిర్వాసిత కుటుంబాలకు అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాతే తరలించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో జనార్దన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ రెడ్డి, తహసీల్దార్లు, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.