30-04-2025 12:00:00 AM
ఒకే ఒక్క ఉగ్రదాడి జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడంతోపాటు కశ్మీర్ ప్రజల ఉపాధి అవకాశాలను దూరం చేసింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తున్నది. టూరిజం పురోగతి వల్ల ఈ మధ్యకాలంలో అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే, సరిగ్గా ఏడురోజుల క్రితం పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ముష్కరదాడి అక్కడి పరిస్థితులను తలకిందులు చేసింది.
దాడి తర్వాత పర్యాటక రంగం తిరోగమనం చెందుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే్ర మధ్య కశ్మీర్‌ను సందర్శించాలని ప్రణాళికలు రూపొందించుకున్న 6,807 మందిలో 62 శాతం మంది తమ పర్యటన ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవలి ఓ సర్వేలో వెల్లడైంది. వచ్చే మూడేళ్లలో కశ్మీర్‌లో పర్యటించే అవకాశాలపై ప్రశ్నించగా, సర్వేలో పాల్గొన్న 33 శాతం మంది ప్రజలు అక్కడ ప్రభుత్వం కల్పించే భద్రతనుబట్టి తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
2018లో జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు దాదాపు మూడవ వంతుకు తగ్గాయి. ఇదే సమయంలో ప్రభుత్వానికి పన్ను రాబడి రెట్టింపు అయింది. 2014 మధ్య రూ.900 కోట్లుగా ఉన్న పర్యాటక రంగ పెట్టుబడులు 2022 నాటికి రూ.2,150కోట్లకు చేరాయి. అలాగే, గత ఆర్థిక సంవత్సరం ఈ పెట్టుబడు లు రూ.5 వేల కోట్లకు చేరాయి. 2021 మధ్య జమ్ములో పర్యాటకుల రాకపోకలు 90 శాతం పెరగ్గా, కశ్మీర్‌లో ఏకంగా 425 శాతం పెరిగాయి. 2021 మధ్య కశ్మీర్‌ను దాదాపు 6.7 లక్షలనుంచి 35 లక్షలమంది ప ర్యాటకులు సందర్శించారు.
కశ్మీర్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్యకూడా గణనీయంగా పెరిగింది. 2021లో కశ్మీర్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 1,614 ఉండగా, గతేడాది ఈ సంఖ్య 43,654కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రధాన ఆర్థిక వనరుల్లో పర్యాటక రంగం ఒకటి. ఈ రంగం నుంచే కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు 8.5 శాతం ఆదాయం సమకూరుతున్నది. అయితే, పహల్గాం ఉగ్రదాడి అక్కడ ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఉపాధి అవకాశాలపై నీలినీడలు కమ్మేలా చేసింది. ఐదుగురు ఉగ్రవాదులు కశ్మీర్ ఆరు సంవత్సరాల వెనక్కి వెళ్లే పరిస్థితులను కల్పించారు.
భారత ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అధిగమించాలి. 2025కు సంబంధించి టూరిస్ట్ సీజన్ ఇప్పుడిప్పుడే మొదలైంది. అమర్‌నాథ్ యాత్రతో జూలైలో ఈ సీజన్ ముగుస్తున్నది. వేసవి సెలవులు ఇంకా కొన్ని వారాలపాటు కొనసాగ నున్నందున కశ్మీర్‌లో పడిపోతున్న పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కశ్మీర్‌లో స్లీపర్‌సెల్స్ క్రియాశీలకం అయ్యారని, మరిన్ని ఉగ్రదాడులు జరిగే ప్రమాదమూ ఉందనే కారణంగా అక్కడ కొన్ని పర్యాటక కేంద్రాలను మూసి వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఉగ్రదాడులు జరుగుతాయనే భయంతో పర్యాటక ప్రాంతాలను మూసి వేయడానికి బదులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, పర్యాటకుల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టడం ద్వారా కశ్మీర్‌లో పర్యాటక రంగం తిరిగి గాడిన పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఉపాధి అవకాశాల పరంగా అక్కడి ప్రజలకు ఎటువంటి లోటూ ఏర్పడదు. దీన్ని గుర్తించి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.