30-04-2025 12:00:00 AM
బ్రిటీషు వాళ్ళు వెళుతూ, వెళుతూ వెలిగించి వెళ్ళిన విభజన సి ద్ధాంతం (విభజించి పాలించు) ఏడున్నర దశాబ్దాలుగా జడలు విరబోసుకుంటూ మారణకాండ సృష్టిస్తూ రగులుతూనే ఉం ది. దేశ విభజన నాటి గాయం నుంచి ని న్నటి పహల్గామ్ ఉగ్రదాడి వరకు కశ్మీర్ సంస్థాన విలీనం కథ నిరంతరం సాగుతూనే ఉంది. ఇంకెప్పటిదాకా ఇలా హిం సాత్మక మలుపులు తిరుగుతూ ఉండాలో ఎవరూ చెప్పలేని పరిస్థితి. భారతదేశ స్వాతంత్య్ర కాలంలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా మండిన చిన్న కుంపటిని అప్పుడే చల్లార్చుకుంటే పోయేది.
కానీ, రాజకీయాలు చలి కాచుకోవడానికే అన్నట్టుగా నిప్పును రాజేయడం వల్ల ఇప్పటికై నా ఏం సాధించాం? అయిదేళ్లుగా, ఇక సద్దుమణుగుతుందనగా మళ్ళీ హింసాకాండ అమానవీయంగా పడగ విప్పింది. ఇటీవలి పర్యవసానాలు మరింత భయానకంగా కనిపిస్తున్నాయి. చివరకు దానిని చల్లార్చుకుందామా లేక మొత్తం ఇల్లు తగుల బెట్టుకుందామా?
ఈ నేపథ్యంలో వచ్చే మౌలికమైన ప్ర శ్న మరొకటి ఉంది. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒక్కలా ఎందుకు ఉండరు? ఆస్తులు పంచుకొని ఎవరి బతుకు వాళ్ళు బతికే అన్నతమ్ముల్లా భారత్, పాక్ దేశాలు ఎందుకు ఉండలేక పోతున్నాయి? నిన్నటి తప్పులు తవ్వుతూ పోతే నేటికి రేపంటూ ఉండదు కదా! ఇటు మనం, అటు వాళ్ళు ఎక్కడో చోట, ఎందుకు ముగింపు పలుకకూడదో అందరం ఆలోచించుకోవాలి.
ప్రజల మనోభావాలకు విలువ
ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల కోసమే అయితే పాలకులు, ప్రతిపక్షాల మధ్య అధికార సాధన కోసం ఈ కొట్లాటలు ఎందు కు వస్తున్నాయి?! ఇక్కడి మన హైదరాబాద్ నుంచి అక్కడి కశ్మీర్ వరకు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలకులు ఉండక పోవడం వెనుక ‘విభజన రాజకీయమే’ కనిపిస్తున్నది. పాలకులు ఎవరైనా వారి వ్యక్తిగత ఇషాలను సామాజిక బాధ్యత కు రుద్దడమే సమస్యగా ఉంటున్నది. ‘కుంపటి అంటుకోవాలంటే ఏదో ఒక సమస్య అనే నిప్పు ఉండాలి.
కులమతాలు అయితే భావోద్వేగాల ఆజ్యంతో పనుండదు’. ఇదీ రాజకీయాలలో కనిపించని కు తంత్రం. సామాన్య ప్రజలకు ప్రశాంతంగా జీవించడమే తెలుసు. ఎవరి మానాన వాళ్ళు బత కడమే. కానీ, ఆ పరిస్థితులు భాగ్యమై పో తున్నాయి. రాచరికంలో అయినా, ప్రజాస్వామ్యంలో అయినా, ప్రజలకు మంచి చేసినా, చెడు చేసినా అది పాలకుల పుణ్య మే. వారు ఎవరు, ఏ వర్గం, మరే మతం వారు అయినా ఇంతే.
శ్రుతి మించుతున్న ఉద్రిక్తతలు
భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఒక భూభాగం నుంచి వేరు పడ్డవే. ఇరు ప్రజ ల సంస్కతి వేరు అయినా శాంతియుత జీవనం విషయంలో ఒక్కటే. అయినా, దేశాధినేతలు ఎందుకు ఏకతాటిపైకి రా రు? 1947, ఇంకా అంతకు ముందునుం చీ రెండు దేశాలు చేసిన, చేస్తున్న ప్రతిదీ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూనే ఉంది. రాజకీయాలతో సంబంధం లేని సామాన్య ప్రజలకు బాగానే స్పష్టత ఉంది. అయినా పరిష్కారం అమలు కావడం వారి చేతుల్లో లేదు. బలి పశువులుగా వారే మారవలసి వస్తున్నది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాతి పరిస్థితులు, నాయకుల పోకడలు, మతాల ప్రమేయాలు వంటి కారణాలు ఎ వరికీ తెలియనివేమీ కావు.
కానీ, అటువై పు, ఇటువైపు అతివాద భావజాల వ్యక్తులను పక్కన పెడితే, ఇరు దేశాల పాలకుల మధ్య అయినా సమన్వయం, సానుకూలత ఉండాలి కదా! ఎందుకు సయోధ్య అసాధ్యంగా మారుతున్నది? కశ్మీర్ మాది అంటే, మాది అని ఇరు దేశాల ప్రజలు భావోద్వేగాలకు పోవడం వెనుక ఎలాంటి రాజకీయాలూ లేవా? జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత మన ఇ రు దేశాలమధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఎంతగా అంటే, ఇక యుద్ధమే తరు వాయి, ధర్మసంస్థాపనే మార్గం అన్నంతగా. ఇంతేనా, ఆలోచించుకోవడానికి ఇం కేమీ లేదా? కాలం ఏదైనా, నాయకులు ఎ వరైనా బడితె ఉన్నవారికి బర్రెలు భయపడక తప్పదు. ప్రజల అభిప్రాయంతో సం బంధం లేకుండా వాళ్లను గొర్రెలుగా మా ర్చి, పబ్బం గడుపుకోవడం నాయకత్వం అనిపించుకోదు. ప్రజల చేతుల్తో ప్రజల చెంపలనే వాయించడం అంటే ఇదే మరి.
ప్రజలు వేరు కావచ్చు కానీ..
విభజన జరిగిన వెంటనే, ఆనాటి మన ‘మహా’నాయకులు రెండు దేశాల మనుగ డ సిద్ధాంతాలను విడివిడిగా ప్రతిపాదించలేక పోయారు. మతం ప్రాతిపదికన పాక్ ను ఏర్పరచినప్పుడు అదే ప్రాతిపదికత భారత్‌కూ ఎందుకు వర్తింపజేయలేదు? “విధి మలుపుద్వారా వేరైన ఇద్దరు తోబుట్టువులు”గా రెండు దేశాలను అభివర్ణించు కొనే పరిస్థితిని వారే సృష్టించారు. దీనిని ‘నిజమే కదా’ అని అందరూ నమ్మేలా తగినన్ని సారూప్యతలు, జ్ఞాపకాలు కూడా చరిత్రలో మిగిల్చారు. ప్రపంచంలోని అగ్రనాయకులైనా బాధ్యతగా, సరైన పెద్దరికం చేశారా అంటే అదీ లేదు. అన్నతమ్ముల పంచాయితీలోకి జొరపడకుండా వాళ్ల మానాన వాళ్లను వదిలేశారు, ‘కొట్టుకొని చావండి’ అంటూ.
ఈ తరుణంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కొద్ది రోజుల కిందట తన దేశీయులకు గుర్తు చేసిన విషయం మరీ విడ్డూరం. “వాళ్లూ (భారతీయులు), మనం (పాక్ ప్రజలు) ఒకేలాంటి వ్యక్తులం కాదు” అన్న ఆయన వ్యాఖ్య, దాని వెనుక ‘ఉద్దే శం’ గమనార్హం. పాలకులు ప్రజలను రెచ్చ గొడుతారని చెప్పడానికి ఇది తాజా నిలువెత్తు ఉదాహరణ. ఆయన తనకు తాను ఏమనుకున్నారో ఏమో విశ్లేషకులకు మా త్రం ఒక వేడి తేనీరు ఇచ్చారు. నిజమే, సాంస్కృతిక వారసత్వాల పరంగా ఇరు దేశాల ప్రజల జీవన విధానాలు వేరు కావచ్చు. పరస్పర మత సిద్ధాంతాలు పూర్తి భిన్నమై ఉండొచ్చు.
అంత మాత్రాన పక్కపక్కన, ఎవరి బతుకు వారు బతక లేనంత శత్రుత్వం సామాన్యులమధ్య ఉందా? ఈ రోజు వరకు, గడిచిన ఏడు దశాబ్దాలుగా భారతదేశం, పాకిస్తాన్ దేశాల నడుమ “వ్యత్యాసం ఆర్థిక, వ్యాపార, విద్యా, క్రీడా రంగాలలో మాత్రమే” అని గట్టిగా నొక్కి చెప్పేవారు. ఇకనుండి అది ‘సాంస్కృతిక భావజాలాని’కి కూడా విస్తరించి కొత్తపుంతలు తొక్కేలా వుంది. పరిస్థితి ఇంతటితో కూడా ఆగేలానూ కనిపించడం లేదు. “ఇప్పుడు భారతదేశం 1948, 1965, 1971, 1999 సంవత్సరాలలో పూర్తి కాని అజెండాలను నెరవేర్చాలి” అని మన దేశ పాలకులకు కొందరు విశ్లేషకులు సలహా ఇచ్చేదాకా వచ్చింది. యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయమైన భారతదేశ ‘వసుదైక కుటుంబ’ నమూనా జీవన విలువను, తాత్తికతను ప్రజలకంటే ఎక్కువగా ఇరు పాలకులు అర్థం చేసుకోవలసి ఉందేమో.
భారతదేశమే బాధితురాలు
గడచిన సంక్షోభ పర్యవసానాలవల్ల ఇ రు దేశాలలో బాధిత దేశంగా ఎప్పుడూ (ఉగ్రదాడులతో) భారతదేశమే నిలుస్తుండడం బాధాకరం. పహల్గామ్ దాడి నేప థ్యంలో కొన్ని ప్రధాన అంశాలపట్ల భారతీయ ప్రభుత్వం దృష్టి సారించవలసిన అవసరం ఇప్పుడు ఉంది. సమస్య మౌలిక పరిష్కారం ఒకవైపు, మరింత పటిష్టమైన, ఖచ్చితమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు ఇంకోవైపు తప్పనిసరి. ఈ సంఘటనలో పా ల్గొన్న నలుగురిలో ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తానీయులు అని నివేదికలు చెబుతున్నాయి. వారు నెలల క్రితమే జమ్మకశ్మీర్ లోకి చొరబడి చాలా కాలంగా దాగి ఉం డాలి.
అక్కడ మొత్తం భద్రతకు బాధ్యత వహించే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ‘యూనిఫైడ్ కమాండ్’ ప్రభావంపై ఇది ప్రశ్నార్థకాన్ని లేవనెత్తుతుంది. ఇటీవలి సం వత్సరాలలో చొరబాటు అత్యల్ప స్థాయి లో ఉందని భారత ప్రభుత్వం చెబుతున్నప్పుడు పై చొరబాటు ఎలా, ఎప్పుడు జరి గిందో దర్యాప్తు జరపాలి. జమ్ముకశ్మీర్ లోపల, వెలుపల సామాజిక, రాజకీయ స్థాయిలో అసౌకర్యకరమైన ప్రశ్నలను నిష్పాక్షికంగా చర్చించాలి. ఇప్పటికైనా పాకిస్థాన్ పాలకులు పాఠం నేర్చుకోవాలి.
-దోర్బల బాలశేఖరశర్మ