మల్కాజిగిరిపైనే అందరి గురి!

20-04-2024 01:48:58 AM

l రాజకీయ భవిష్యత్తు కోసం ఈటల ఆరాటం

l పట్టు నిలుపుకోవడం కోసం బీఆర్‌ఎస్ పోరాటం

l సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని రేవంత్ పంతం

l అతిపెద్ద సెగ్మెంట్‌లో గెలుపే లక్ష్యంగా ప్యూహరచనలు

l గెలుపు, ఓటముల్లో 14 లక్షల సెటిలర్ల ఓట్లే కీలకం

l మల్కాజిగిరిలో మొదటి నుంచి విలక్షణమైన తీర్పే

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి)ః భారత్‌లో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి. పార్లమెంట్  నియోజకవర్గాల పున ర్విభజనలో భాగంగా 2008వ సంవత్సరం లో మల్కాజిగిరి సెగ్మెంట్ ఆవిర్భవించింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జాల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మల్కాజిగిరి, మేడ్చ ల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్ (సికింద్రాబాద్), ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాల పరిధిలో 37,28,417 మంది ఓటర్లున్నారు. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి, ఉద్యోగ, వ్యాపారరీత్యా వచ్చి స్థిరపడిన సెటిలర్ల ఓట్లు సుమారు 14 లక్షల వరకు ఉంటాయి. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థుల గెలుపు, ఓటములలో సెటిలర్ల ఓట్లే అత్యంత కీలకం. 

గెలుపే లక్ష్యంగా ఈటల ఆరాటం...

దేశంలోనే పద్ద నియోజకవర్గంలో గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై గురి పెట్టాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తును, తన సామాజిక అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈటల కేసీఆర్ ప్రభుత్వంలో రెండు దఫాలుగా మంత్రిగా పని చేశారు. తదనంతరం విభేదాలతో బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి 2021లో బీజే పీలో చేరారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఈట ల రాజకీయ భవిష్యత్తు బీజేపీలో చేరిన తర్వాత కొంత ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో హు జూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. దీంతో కొంత కుంగుబాటుకు గురైన ఈటల కనీసం పార్లమెంట్ ఎన్నికలలోనైనా గెలిచి తన రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలరని ఆరాటపడుతున్నారు. 

పట్టుకోసం బీఆర్‌ఎస్...

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరం లో, నగర శివారులో నాటి బీఆర్‌ఎస్ పార్టీకి ఏమ్రాతం పట్టు ఉండేది కాదు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, పట్టణీకరణ సంస్కరణలు, అభివృద్ధి పనుల కారణంగా హైదరాబాద్‌తో పాటు నగర శివారులోను నేటి బీఆర్‌ఎస్ ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అసెంబ్లీ ఎన్నికలలో, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో పాటు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లను, మున్సిపల్ చైర్మన్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిం ది. 2023 అసెంబ్లీ ఎన్నికలలోనూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడుమంది ఎమ్మెల్యేలు అఖండ మెజార్టీతో గెలుపొందారు.

అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోల్పో యిన కారణంగా ఇక్కడి నుంచి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మల్లారెడ్డి పార్టీ మారేందుకు బీజేపీ, కాంగ్రెస్ తలుపుతట్టారు. కానీ ద్వారాలు తెరుచుకోలేదు. ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనుచరుడిగా ఉన్న రాగిడి లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాని కారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో పలు సేవా, సామాజిక కార్యక్రమాలు చేపట్టిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ నాయకులందరి సయోధ్యతో రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం పోరాటం చేస్తున్నారు.  

రేవంత్ ఆపరేషర్ ఆకర్ష్...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మల్కాజిగిరి పరిధిలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. కానీ రేవంత్ రెడ్డి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేవలం 10వేల పై చిలుకు ఓట్లతో రేవంత్ గెలుపొందారు. అయితే గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకున్నారు తప్ప నియోజకవర్గంలో పెద్దగా తిరిగింది లేదు. కాంగ్రెస్ క్యాడర్‌ను పెంచింది లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియో జకవర్గాలలో కాంగ్రెస్ ఒక్కస్థానంలోను గెలవకపోగా, కంటోన్మెంట్, ఎల్‌బీ నగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో మూడో స్థానానికే పరిమితం అయ్యింది.

అయితే ప్రస్తుతం సిట్టింగ్ స్థానంగా ఉన్న మల్కాజిగిరిని ఎలాగైనా చేజెక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్.. రంగారెడ్డిలో బలమైన నాయకుడు పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. ఆయన భార్య సునీతామహేందర్ రెడ్డిని మల్కాజిగిరి బరిలో నిలిపారు. సునీతారెడ్డి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌కు రెండు సార్లు చైర్మన్‌గా చేసిన అనుభవంతో పాటు ప్రసుత్తం వికారాబాద్ జిల్లా  పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు. 

అయితే కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ లేనప్పటికీ.. అధికార పార్టీ హోదాలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుం టూ బలం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

రెండు సార్లు గెలిచిన చరిత్రే లేదు

మల్కాజిగిరి పార్లమెంట్  నియోజకవర్గ పరిధిలో ఓటర్ల తీర్పు విలక్షణంగానే ఉంటుంది. ఆది నుంచి ఒక పార్టీ అభ్యర్థి రెండు సార్లు గెలిచిన చరిత్రనే లేదు. 2009 నుంచి మూడు సార్లు ఎన్నికలు జరుగగా మొదటిసారి 2009లో కాంగ్రె స్ అభ్యర్థి సర్వే సత్యానారయణ గెలిచా రు. 2014లో టీడీపీ నుంచి చామకూర మల్లారెడ్డి గెలిచారు. అప్పట్లో టీడీపీ గెలిచిన ఏకైక ఎంపీ స్థానం ఇదే. 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు.

కొండగల్‌లో ఓడిన తర్వా త రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి ఊతమిచ్చింది మల్కాజిగిరి పార్లమెంట్ స్థానమేనని చెప్పాలి. ఈ ఎన్నికలలో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిచేందుకు మూడు ప్రధాన పార్టీలు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై ప్రధానంగా దృష్టి సారించారు. అభ్యర్థులందరూ రాజకీయ అనుభవం ఉన్నవాళ్లే కావడంతో ప్రచారంలో దూసుకెళ్తూ ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలను పేల్చుతున్నారు. ఈ ఎన్నికలలో మల్కాజగిరి ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారో వేచి చూడాల్సిందే.