calender_icon.png 13 May, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లకు అర్థం అవుతుంది

03-05-2024 12:46:05 AM

మా వాగ్దానాలు సరళంగా, స్పష్టంగా ఉన్నాయి

ప్రత్యేకంగా వారికి వివరించాల్సిన పనిలేదు

కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై  మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు

ప్రధాని మోదీకి రెండో బహిరంగ లేఖ

న్యూఢిల్లీ, మే 2: కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తాము ఏం పొందుపరిచామో.. ఏ గ్యారంటీలు ఇచ్చామో అర్థం చేసుకునే తెలివి ఓటర్లకు ఉందంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. తాము మ్యానిఫెస్టోలో పొందుపరిచిన భాష సామాన్య ఓటర్లకు అర్థం అవుతుందని, అది ప్రధాని కార్యాలయం భాష కాదంటూ ఎద్దేవా చేశారు. తమ గ్యారంటీలు చాలా సరళంగా, స్పష్టంగా ఉన్నాయని, వాటి గురించి ఓటర్లకు ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న విభజన రాజకీయాలు, వివక్షపూరితమైన హామీలను, కాంగ్రెస్ ఉద్దేశాలను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పాలంటూ బీజేపీ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దీనికి కౌంటర్‌గా ప్రధాని నరేంద్ర మోదీకి రెండో సారి మల్లికార్జున ఖర్గే బహిరంగ లేఖ రాశారు. ‘మీరు రాసిన లేఖలో భాష చూస్తుంటే మీరు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అర్థం అవుతోంది.

అందుకే ప్రధానమంత్రి హోదాకు సరిపోని భాషను మీరు ఉపయోగిస్తున్నారు. మీ ప్రసంగాల్లో చెప్పే అబద్ధాలు పెద్దగా ప్రభావం చూపట్లేదని, అవే అబద్ధాలను ప్రచారం చేయాలని మీ అభ్యర్థులకు కూడా చెబున్నట్టు అర్థం అవుతోంది. వెయ్యి సార్లు అబద్ధాలను చెప్పినా.. అది నిజం కాలేదని గుర్తుపెట్టుకోండి’ అని ఖర్గే హితవు పలికారు.  ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కుని ఓటు బ్యాంకుకు ఇసతామని మీ లేఖలో చెబుతున్నారు. అవును.. మా ఓటు బ్యాంకు పేదలు, అణగారిన వర్గాలు, మహిళలు, యువత, కార్మిక వర్గాలు, దళితులు, ఆదివాసీలు. 1947లో రిజర్వేషన్లను వ్యతిరేకించిం ది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అనే విషయం అందరికీ తెలుసు. మీ నేతలే బహిరంగంగా దీని గురించి మాట్లాడుతున్నారు’ అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో దుయ్యబట్టారు.