03-05-2024 12:48:18 AM
దాయాది దేశానికి హస్తం పార్టీ శిష్యురాలు
శత్రువులు భారత్‌లో బలహీన ప్రభుత్వాన్నే కోరుకుంటారు
ఇక్కడ కాంగ్రెస్ చస్తుంటే పాక్ ఏడుస్తోంది
ఇండియా కూటమి ఓట్ జిహాద్‌కు పిలుపునిస్తోంది
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోంది
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు
ఆణంద్ (గుజరాత్), మే 2: పాకిస్థాన్‌కు కాంగ్రెస్ పార్టీ శిష్యురాలని, భారత్‌కు తర్వాతి ప్రధానమంత్రిగా యువరాజును కూర్చొబెట్టాలని దాయాది దేశం ఆరాటపడుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇక్కడ సమాధి అవుతోందని అక్కడ పాక్ ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలవాలని పాకిస్థానీ నాయకులు ప్రార్థనలు చేస్తున్నారని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఆణంద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, పాకిస్థాన్ మధ్య సంబంధం బయటపడింది. మన శత్రువులు భారత్‌లో బలహీన ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటారు. ఇక్కడ యువరాజే ప్రధాని కావాలని పాక్ కోరుకుంటోంది. ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే పాక్‌కు కాంగ్రెస్ పార్టీ శిష్యురాలు అని పేర్కొన్నారు.
రిజర్వేషన్లు లాక్కునే కుట్ర..
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే ప్రణాళికలో కాంగ్రెస్ ఉందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన లేదా బ్యాక్‌డోర్ నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోమని లిఖితపూర్వకంగా రాసివ్వాలని హస్తం పార్టీకి మోదీ సవాల్ విసిరారు. నేడు ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
ఓట్ జిహాద్ దుమారంపై..
అనంతరం సమాజ్‌వాదీ నేత మరియా ఆలం చేసిన వివాదాస్పద ఓట్ జిహాద్ వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ఆమె ప్రకటనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఇండియా కూటమి విధానాలను, ప్రణాళికలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇండియా కూటమి ప్రణాళికలను ఓ మహిళా నాయకురాలు బయటపెట్టింది. వాళ్ల మధ్య అప్రకటిత ఒప్పందం ఉంది. ముస్లింలు ఓట్ జిహాద్ చేయాలని, ఇండియా కూటమికే అందరూ కలిసి ఓటు వేయాలంటూ ఆమె కోరారు. ఈ మాటలు చెప్పింది మదర్సా నుంచి వచ్చిన పిల్లలు కాదు. ఉన్నతంగా చదువుకున్న ఓ కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ఈ వ్యాఖ్యలను ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఖండించలేదు. అంటే దానర్థం.. ముస్లింలంతా కలిసి వారికే ఓటు వేయాలని ఇండియా కూటమి చెబుతోంది. ఓ వైపు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడదీయాలని చూస్తూనే... మరోవైపు ఓట్ జిహాద్ చేయాలని చెబుతోంది’ అని మండిపడ్డారు.
సల్మాన్ ఖుర్షీద్ సమర్థన..
ఉత్తర్‌ప్రదేశ్ ఫరుఖాబాద్‌లో ఎస్పీ అభ్యర్థి నావల్ కిశోర్ శాక్యకు మద్దతుగా మరియా ఆలం ప్రచారం నిర్వహిస్తూ ఓట్ జిహాద్ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓటర్లు ఓట్ జిహాద్ ప్రారంభించాలి. ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఇదొక్కటే మార్గం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని పలువురు అంటున్నారు. కానీ మానవత్వమే ప్రమాదంలో ఉందని నేను భావిస్తున్నా అని ఆమె ప్రసంగించారు. ఈ విషయంలో మరియాతో పాటు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సల్మాన్ ఖుర్షీద్‌పైనా యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.