బీఆర్‌ఎస్ బిగ్ షాక్

20-04-2024 02:15:50 AM

l కాంగ్రెస్‌లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే 

l ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ 

l త్వరలో హస్తం గూటికి ప్రకాశ్‌గౌడ్ 

l కాంగ్రెస్‌లోకి కేటీఆర్ బావమరిది

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులున్నాయి. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మరుసటి రోజే.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో ప్రకాశ్‌గౌడ్ భేటీ కావడంతో.. గత కొంతకాలంగా పార్టీ మారుతారని వస్తున్న ఊహాగాహనాలకు తెరపడింది.

ఒకటి, రెండు తన అనుచరలతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నారు. మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్రనాయక్ శుక్రవారం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మరో నేత, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి దగ్గరి బంధువు (సోదరుడు) ఎడ్ల రాహుల్‌రావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు వివిధ జిల్లాల నుంచి చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు , కార్యకర్తలు పార్టీలోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రకాశ్‌గౌడ్‌తో సీఎంను కలిసిన వారిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.  

చేవెళ్లలో పార్టీకి మరింత బలం.. 

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో తమకు లాభం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్‌కు చెందిన  నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరితే తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరుకుంటుందని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయనానికి దోహదపడుతుందని చెప్తున్నారు.