తెలంగాణను దోచిన బీఆర్‌ఎస్

20-04-2024 02:33:20 AM

n ఆ అవినీతి చూడలేకనే ఈటల బీజేపీలోకి

n రూపాయి అవినీతి చేయని బీజేపీ ప్రభుత్వం

n కిషన్‌రెడ్డి మచ్చలేని నాయకుడు

n రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడి

n బీఆర్‌ఎస్‌కు ఎక్కడా డిపాజిట్ కూడా రాదు

n తెలంగాణకు బీఆర్‌ఎస్ అవసరం తీరిపోయింది

n కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

n సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచేసిందని విమర్శించారు. అవినీతి రహిత ప్రభుత్వమంటే ఒక్క బీజేపీకే సాధ్యమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లోక్‌సభ నియోజక వర్గానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనేక మంది బలిదానాల తర్వాత సాధించుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందని ఆరోపించారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదని అన్నారు. బీజేపీ వల్ల దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నదని, ప్రపంచంలో ఇప్పుడు ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతున్నదని చెప్పారు. 2047లోపు దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నదని పేర్కొన్నారు.

500 ఏళ్లుగా సాధ్యం కాని అయోధ్య రామ మందిర నిర్మాణం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సాధ్యమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఇప్పుడు కశ్మీర్ స్వేచ్ఛగా ఉన్నదని తెలిపారు. ట్రిపుల్ లో..తలాక్ రద్దు చేశామని, సీఏఏ తీసుకువచ్చామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాని డిజిటల్ లావాదేవీలు మన దేశంలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ వల్ల చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. కిషన్‌రెడ్డి  ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆయన అవినీతి రహిత నాయకుడని ప్రశంసించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఈటల రాజేందర్ అక్కడి అవినీతిని చూసి భరించలేక బయటకు వచ్చి బీజేపీలో చేరారని తెలిపారు. కిషన్‌రెడ్డి, ఈటలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

ప్రజలు తల దించుకునేలా ప్రవర్తించలేదు: కిషన్‌రెడ్డి 

తాను 2004 నుంచి ఎమ్మెల్యేగా, 2019 నుంచి ఎంపీగా ఉన్నానని, తనకు ఓటేసిన ప్రజలు తలదించుకునేలా ఏనాడూ ప్రవర్తించలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నైతిక విలువలకు కట్టుబడిన ప్రజాప్రతినిధిగా తన రాజకీయ జీవితం సాగుతున్నదని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సబ్‌కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మరోసారి తనను సికింద్రాబాద్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అత్యధిక స్థానాలు బీజేపీయే కైవసం చేసుకుంటుందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌కు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా రాదని అన్నారు. బీఆర్‌ఎస్ నిన్నటి పార్టీ అని, వారి ఆవశ్యకత రాష్ట్రానికి ఇక లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ శకం ముగిసిందని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని, తమకు కాంగ్రెస్ పార్టీతోనే ప్రధానమైన పోటీ ఉంటుందని తెలిపారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో గ్యారెంటీలు అమలు చేసేలా బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు.  

అంబర్‌పేట మహంకాళీ ఆలయంలో పూజలు

నామినేషన్ వేస్తున్న సందర్భంగా కిషన్‌రెడ్డి అంబర్‌పేటలోని మహంకాళీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నల్లకుంటలోని శంకర్‌మఠ్‌లో స్వామి వారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం అంబర్ పేట మహంకాళీ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాగ్ అంబర్‌పేటలోని సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా మహబూబ్ కళాశాలకు బయలుదేరారు. కళాశాలలో వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్‌తో ర్యాలీగా కలిసివెళ్లి సికింద్రాబాద్ లోక్‌సభ ఆర్‌ఓ కార్యాలయమైన జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరంలేదు: కే లక్ష్మణ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తిప్పికొట్టారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఆలోచనే తమకు లేదని స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే తిరగబడి కూలగొడతారని అన్నారు. తెలంగాణలో మోదీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.

దేశంలోని విపక్ష పార్టీలకు మోదీ అభివృద్ధి అజెండాపై మాట్లాడే ధైర్యమే లేదని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మారుపేరుగా మారాయని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు బీజేపీయే గెలుస్తుందని తెలిపారు. సికింద్రాబాద్‌లో న్యాయం, అన్యాయం మధ్యనే పోటీ జరుగుతున్నదని ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. నలుగురు ఎంపీలు ఉంటేనే రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల నిధులు తీసుకువచ్చారని, 12 మంది ఉంటే రూ. 30 లక్షల కోట్లు తీసుకువస్తారని తెలిపారు.  

కిషన్‌రెడ్డి ప్రజల మనిషి: ఈటల 

ముంజేతి కంకణానికి అద్దమేల.. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల అన్నట్లుగా నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న కిషన్‌రెడ్డి.. ఒక్క సికింద్రాబాద్ కోసమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతత లేని పరిస్థితుల్లో కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ అక్కడి బాధ్యత అప్పగించారని, ఇప్పుడు ఆ రాష్ట్రాలు దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా దేశంలో అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర వహించిన కిషన్‌రెడ్డి ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చారని కొనియాడారు. మరోసారి కిషన్‌రెడ్డిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు.