కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

20-04-2024 02:26:30 AM

l 14 ఎంపీ స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు

l 17 స్థానాలు మూడు క్యాటగిరీలుగా విభజన

l 8 స్థానాల్లో  విజయం తథ్యమని ధీమా

l గట్టిగా పోరాడితే మరో ఆరు వస్తాయని అంచనా

l మూడు చోట్ల విజయం కష్టమని భావన    

l ఎన్నికల్లోనూ పట్టు సాధించేందుకు వ్యూహరచన  

l మంత్రులు, ఇన్‌చార్జ్‌లు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం 

హైదరాబాద్, ఏప్రిల్ 1౯ (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా, కనీసం 14 సీట్లను హస్తగతం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నది.  ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లు, ఆ తర్వాత పార్టీ బలాబలాల్లో వస్తున్న మార్పుల ప్రతిపాదికన 17 లోక్‌సభ స్థానాలను 3 క్యాటగిరీలుగా విభజించింది.

ఏ క్యాటగిరీ కింద కొంత మేర కష్టపడితే గెలుపు సునాయసమేనని ధీమాగా ఉన్న స్థానాలు, బీ క్యాటగిరీ కింద ఎంత కష్టమైనా గట్టిగా కృషి చేస్తే గెలుపొందవచ్చని భావిస్తున్న నియోజకవర్గాలు, సీ క్యాటగిరీలో గెలుపు అంత సులువు కాదని భావిస్తున్న స్థానాలను చేర్చినట్లు సమాచారం. మూడు క్యాటగిరీల్లో మూడు వ్యూహాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

8 చోట్ల గెలుపు సులువే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో 20 వేల కంటే ఎక్కువగా మెజార్టీ సాధించింది. 20 నుంచి 50 వేల మధ్య మెజార్టీ సాధించిన నియోజకవర్గాలు 50 వరకు ఉన్నాయి. ఇందులో పార్లమెంట్  నియోజకవర్గాల వారీగా పరిగణనలోకి తీసుకుంటే కనీసం 8 నియోజకవర్గాల్లో  కాస్త కష్టపడితే సునాయసంగా విజయం సాధించడానికి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు  భావిస్తున్నారు.

వీటిలో నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్, జహీరాబాద్  నియోజక వర్గాలున్నాయి. దీంతో ఆయా స్థానాల్లో సాధ్యమైనంత ఎక్కువ మెజార్టీ సాధించేదిశగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, లోక్‌సభ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని, పోలింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండాలని అధిష్ఠానం సూచించినట్టు సమాచారం.  

బీ క్యాటగిరీలో ఆరు స్థానాలు

కాంగ్రెస్ పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం బీ క్యాటగిరీలో మరో ఆరు స్థానాలున్నట్లు సమాచారం. అదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో గెలుపు కష్టమైనా.. గట్టిగా కృషి చేయాలనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో  సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం కూడా ఉన్నది. దీంతో పాలమూరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ పోటీ చేస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని గెలిపించుకుని ఉమ్మడి పాలమూరులో ఆధిపత్యం చాటాలనే పట్టుదలతో సీఎం ఉన్నట్లు చెప్తున్నారు.

ఇక నిజామాబాద్‌లో మాజీ మం త్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అదిలాబాద్‌లో అత్రం సుగుణ అభ్యర్థిత్వాలు కలిసి వస్తాయని కాం గ్రెస్ పార్టీ అంచనా వేస్తున్నది. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల  నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతాన్ని చూస్తే లోక్‌సభ ఎన్నికల్లో విజయం అంత తేలిక కాదనే భావనతో ఉన్నప్పటికీ.. మారిన రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాలు విజయానికి బాటలు వేస్తాయనే ధీమా ఆ పార్టీలో కనిపిస్తున్నది. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మల్కాజ్‌గిరి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీత, చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిలో పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినవారే.  

ఇవి కష్టమే

సీ క్యాటగిరీలో హైదరాబాద్, మెదక్, కరీంనగర్  నియోజకవర్గాలున్నట్టు సమాచారం. ఈ  మూడు నియోజకవర్గాల్లో  విజయం అంత సులువు కాదనే అభిప్రాయంతో ఉన్నారు. హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతోంది. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలుస్తున్నది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ మధ్య స్నేహపూర్వక పోటీ తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో మాజీ ముఖ్యంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గాలు ఉన్నందున.. ఇక్కడ బీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.

సొంత నియోజకవర్గంలో పార్టీ గెలిపించుకోవడానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలకంగా వ్యవహారించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డుతో విజయం సాధించాలని నీలం మధు ముదిరాజ్‌కు టికెట్ ఇచ్చింది. బీసీ కార్డు ఏ మేరకు పని చేస్తోందనేది చూడాల్సి ఉంది. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ బరిలో ఉండటంతో.. అక్కడ కాంగ్రెస్ విజయానికి అవకాశాలు లేవని అంచనాలో ఉన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

కలవర పెడుతున్న సామాజిక అంశాలు

పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో విజ యం సాధించాలని పట్టుదలతో ఉన్నప్పటికి.. టికెట్ల కేటాయింపుల్లో  జరిగిన పొరపాట్లు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన 14 నియోజకవర్గాల్లో  3 స్థానాలు ఎస్సీ, 2 స్థానాలు ఎస్టీకి రిజర్వుడుగా ఉన్నాయి. మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో తెలంగాణలో పెద్ద సామాజిక వర్గమైన మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. పెద్దపల్లి, నాగర్‌కర్నూల్  సీట్లు మాల సామాజిక వర్గానికి, వరంగల్ టికెట్‌ను బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన కడియం శ్రీహరి కూతురు కావ్యకు చివరి నిమిషంలో కేటాయించారు.

దీంతో కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజికవర్గం గుర్రుగా ఉన్నది. చివరికి కంటోన్మెంట్  అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాల సామాజికవర్గానికి చెందిన శ్రీ గణేష్‌ను పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన 9 జనరల్ స్థానాల్లో  రెడ్డి సామాజిక వర్గానికి 6 సీట్లు కేటాయించి..   బీసీలకు మాత్రం మూడు సీట్లే ఇచ్చారని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  ఈ పరిణామాలు ఎన్నికల వరకు ఎటువైపు దారి తీస్తాయోనని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.