కరువు పాపం బీఆర్‌ఎస్‌దే

20-04-2024 02:35:45 AM

l నాడు నీటి వృథాతోనే నేడు ఈ పరిస్థితి

l రాష్ట్రానికి కొత్త విద్యుత్తు పాలసీ అవసరం

l మేం వచ్చేనాటికి 3690 కోట్ల లోటు బడ్జెట్

l ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వానికి ఢోకా లేదు

l విద్యా హక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తాం

l మీట్ ది ప్రెస్‌లో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి ): రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొనడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం గత పాలకులు రిజర్వాయర్ల నుంచి అడ్డగోలుగా నీటిని  విడుదల చేయడంతో ప్రస్తుతం నీటి ఎద్దడి ఏర్పడిందని విమర్శించారు. శుక్రవారం టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో నీటి సమస్య రాకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా రూ.100 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

అసరమైతే మరిన్ని నిధులను ఇచ్చేందుకు కూడా వెనుకాడేది లేదని పేర్కొన్నారు. పంటలు లేని సమయంలో తమ గొప్ప కోసం ఇష్టం వచ్చినట్లుగా నీటి విడుదల చేసి కృత్రిమ కరువు సృష్టించారని బీఆర్‌ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోని నీటిని జాగ్రత్తగా వాడుకొని నీటి ఎద్దడి రాకుండా కాపాడుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ కుంగిపోవడంతోనే గత పాలకులు నీటిని దిగువకు వదిలారని, వారు నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా అనే క తప్పిదాలు చేయడం వల్లనే ప్రస్తుతం నీటి కొరత ఏర్పడిందని ఆరోపించారు. నీటి కొరతపై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, గ్రేటర్ హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లో మంచినీటి కొరత రానివ్వబోమని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం రూ.43 వేల కోట్లతో ఏర్పాటు చేసిన మిషన్‌భగీరథ పథకం ప్రయోజనం ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు.  

కొత్త విద్యుత్తు పాలసీ కావాలి

ప్రపంచవ్యాప్తగా విద్యుత్తు రంగంలో వస్తున్న మార్పులకు అనగుణంగా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎటువంటి కృషి చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. రూ.20 చొప్పున యూనిట్‌ను కొనులుచేసి రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం పవర్ ఎక్స్‌చేంజ్‌లో పీక్ అవర్స్‌లో యూనిట్‌కు రూ.10 చొప్పున మాత్ర మే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. తమ ప్రభుత్వం రానున్న రోజుల్లో పర్యావరణ హితమైన, అతి తక్కువ ధరకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు ప్రణాళికల వేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని తెలిపారు. విద్యుత్తు కోతలు, అంతరాయాలకు ఎంతో తేడా ఉన్నదని అన్నారు. గత నెల  8న 15,623 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్నా అంతరాయం లేకుండా కరెంటు ఇచ్చామని వెల్లడించారు.

2030 నాటికి 30 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్నా అంతరాయం లేని విద్యుత్తును అందించేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విభజన చట్టంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్తు ను కేటాయించినప్పటికి బీఆర్‌ఎస్ ప్రభు త్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించా రు. తెలంగాణకు గుదిబండగా ఉన్న యాదా ద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాలను ప్రారంభించిన గత ప్రభుత్వం, ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం ఎన్టీపీసీ కరెంటు గురించి మాట్లాడటం విడ్దూరంగా ఉన్నదని విమర్శించారు. రాబోయే 25 సంవత్సరాలకు సోలార్ విద్యుత్తును రూ.5.59 చొప్పున అందించేందుకు టెండర్లు వేస్తున్న నేపథ్యంలో యూనిట్‌కు రూ.8 9 చొప్పున ఖర్చయ్యే ఎన్టీపీసీ కరెంటుకోసం పీపీఏ చేసుకోవడం లేదని విమర్శిండం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

లోటు బడ్జెట్‌లో అధికారంలోకి వచ్చాం

గత సంవత్సరం డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన తమకు గత ప్రభుత్వం రూ.3,690 కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు కేటాయించామని, ఎన్నికల కమిషన్ అనుమతితో రైతుల ఖాతాలో వేస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పింది. మీరు చెప్తున్న రూ.7 వేల కోట్లు ఎక్కడ పోయాయి? ఎవరి అకౌంట్‌లోకి పోయాయి? మీరేమైనా తిన్నారా? ఆ మొత్తం రూ.7 వేల కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి మొత్తం రూ.26,374 కోట్లు చెల్లించామని తెలిపారు.

గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయగా తాము రూపాయి పోగేసి గాడిలో పెట్టి ఒకటో తారీఖునే ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్‌లు, చెల్లించే స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, ఆసరా పెన్షన్‌లు సక్రమంగా అందిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మధ్యాహ్న భోజన బిల్లులు, ఆశ, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, గ్రామపంచాయతీల స్వీపర్ల వేతనాలు ప్రాధాన్యత క్రమంలో చెల్లించామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 65 లక్షల మంది రైతులకు రూ.5,575 కోట్లు రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలో జమ చేశామని, మిగతా 5 లక్షల మంది ఖాతాల్లో వేస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉంటుందా? మూసివేస్తారా? అన్న అనుమానాలు ఉండేవని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత గ్యారెంటీని అమలు చేసి ప్రతి మహిళ ప్రయాణం చేసిన జీరో టికెట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నదని వివరించారు. గత మూడు నెలల్లో ఆర్టీసీకి రూ.1,125 కోట్లు చెల్లించడంతో సంస్థ బలోపేతంగా మారిందని తెలిపారు. గృహజ్యోతికి రూ.200 కోట్ల, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.189 కోట్లు, గ్యాస్‌సిలిండర్ సబ్సిడీకి రూ.80 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్తుకు రూ.3,924 కోట్లు, రేషన్ బియ్యం సబ్సిడీ కింద రూ.1,147 కోట్లు, రైతు బీమా ప్రీమియం కింద రూ.734 కోట్లు చెల్లించామని చెప్పారు. మహిళలు ఆర్థికం స్వావలంబన సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఐదేండ్లలో ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున రూ.1 లక్ష కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తామని వెల్లడించారు.  

కేంద్రం ఇచ్చిన 10 లక్షల కోట్లు ఎక్కడ?

గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభు త్వం రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్ప డం హాస్యాస్పదంగా ఉందని భట్టి విక్రమార్క విమర్శించారు. మనకు కేంద్రం నుంచి వచ్చింది రూ.3,70,235 కోట్లు మాత్రమేని తెలిపారు. అవి కూడా రాష్ట్ర ప్రజలు చెల్లించిన ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన హక్కు అని చెప్పారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు ఇచ్చిన రూ.10 లక్షల కోట్లు, మాజీ సీఎం కేసీఆర్ అప్పు చేసి న రూ.7 లక్షల కోట్లు ఏమయ్యాయో కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.