జెయింట్ కిల్లర్ ఒంటరి పోరు

20-04-2024 02:28:13 AM

l సొంతంగానే కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కేవీఆర్

l రేవంత్, కేసీఆర్‌కు వారి పార్టీల నుంచి ఆర్థిక సాయం

l బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డికి అందని ఫండ్

l ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో వివరాలు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): గత ఏడాది డిసెంబర్‌లో ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల కమిషన్ తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఈ ఎన్నికల ఖర్చులను పరిశీలిస్తే ఒక్కో చోట ఒక్కో ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం కామారెడ్డి.

అక్కడి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పోటీ చేయగా.. స్థానికతే ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ అభ్యర్థి కాటేపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇరువురు ఉద్దండులైన కేసీఆర్, రేవంత్‌ను ఓడించి వెంకట రమణారెడ్డి ‘జెయింట్ కిల్లర్’గా పేరు పొందారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి, ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల ఖర్చులకు వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి. 

కేసీఆర్, రేవంత్‌కు పార్టీల అండ

హోరాహోరీగా సాగిన పోటీలో బీజేపీ అభ్యర్థి కేవీఆర్ సంచలన విజయం సాధించారు. రెండు పార్టీ అధిపతులను ఒంటిచేత్తో ఓడించారు. మరో విశేషం ఏమిటంటే ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌కు, రేవంత్‌కు వారివారి పార్టీలు సంపూర్ణంగా ఆర్థిక సహకారం అందించగా, కేవీఆర్ సొంత ఖర్చులతో ఒంటరిగానే పోరాడారు. కేవీఆర్‌కు బీజేపీ ఖర్చులకు ఎలాంటి డబ్బు అందించలేదని ఎన్నికల వ్యయ ఖాతాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ నుంచి రూ.30 లక్షల నగదు అందగా.. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ నుంచి రూ. 40 లక్షలు అందాయి. 

కే వెంకటరమణారెడ్డి (బీజేపీ)

14.11.2023 నాడు కేవీఆర్ రూ.5 లక్షల మొత్తాన్ని ఎన్నికల ఖర్చుల కోసం తీసిన ప్రత్యేక ఖాతాలో జమ చేశారు. నవంబర్ 18న రూ.2.30 లక్షలు, 20నన రూ.10 లక్షలు, అదేరోజు మరో రూ.15 లక్షల మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారు. నవంబర్ 22న రూ.4 లక్షలు డిపాజిట్ చేశారు. మొత్తం రూ.36.30 లక్షల మొత్తాన్ని ఎన్నికల ఖర్చ కోసం బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇందులో నుంచి ఎన్నికల ఖర్చుల కోసం పలు సంస్థలు, వ్యక్తులకు రూ. 27,89,914 చెల్లించారు. ఇంకా బ్యాంకులో (28.11.2023 నాటికి) రూ.8.40 లక్షలకుపైగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌కు అందించిన నివేదికలో పేర్కొన్నారు.  

కేసీఆర్ (బీఆర్‌ఎస్)

బీఆర్‌ఎస్ అధినేత అయిన కేసీఆర్‌కు ఎన్నికల ఖర్చు కోసం (పార్ట్ సీ)లో పేర్కొన్నదాని ప్రకారం 8.11.2023 నాడు పార్టీ ఫండ్‌గా రూ.40 లక్షల మొత్తాన్ని బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ చేశారు. కేసీఆర్‌పై అభిమానంతో నవంబర్ 23న రాజు అన్యే వ్యక్తి రూ.21 వేలు, నరేశ్ రూ.21 వేలు, సురేశ్ రూ.21 వేలు, కిరణ్ రూ.21 వేలు, అరుణ్ రూ.17.5 వేలు, ప్రసాద్ రూ.14 వేలు, శ్రీనివాస్ రూ.10.5 వేలు విరాళం ఇచ్చారు. నవంబర్ 24 నుంచి 27 వరకు నగదు రూపంలో అందిన రూ.2 లక్షల మొత్తాన్ని కూడా బ్యాంకులో డిపాజిట్ చేశారు.

ఇలా డిపాజిట్ చేసిన మొత్తం రూ. 43.26 లక్షలు కాగా.. 28.11.2023 నాటికి అన్ని రకాల చెల్లింపులు పోగా.. బ్యాంకులో రూ. 27,16,157 మొత్తం బ్యాలెన్స్‌గా మిగిలిందని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. పార్ట్ ఏలో చూపించినదాని ప్రకారం రూ.18, 94,007 మొత్తం ఎన్నికల్లో ఖర్చు చేశారు. పార్ట్ బీలో కేసీఆర్ సొంతంగా 9.11.2023 నాడు రూ.లక్ష, 10న రూ.3 లక్షల మొత్తం నుంచి కూడా డీజిల్, వాహనాల కిరాయిల కింద రూ.2,68,855 మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా చూపించారు.

రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)

రేవంత్‌రెడ్డి పార్ట్ ఏలో మొత్తం ఖర్చు రూ. 22,77,852 అయినట్టుగా చూపించారు. పార్ట్ బీలో ఖానాపూర్ గ్రామస్థులు ఎన్నికల ఖర్చు కోసం రూ. 10 వేలు చందా ఇచ్చినట్టు పేర్కొన్నారు.  పార్ట్ సీలో ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవడానికి రూ.10 వేలను 8.11.2023 నాడు డిపాజిట్ చేశారు. నవంబర్ 16న రేవంత్‌రెడ్డి అకౌంట్ నుంచి రూ.5 లక్షల మొత్తం ఈ ఎన్నికల ఖర్చు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. 17.11.2023న ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) ఖాతా నుంచి రూ.30 లక్షల మొత్తం జమచేశారు. 27.11.2023 నాటికి ఈ ఖాతాలో రూ. 26,46,645 మొత్తం బ్యాలెన్స్ ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.