22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర

20-04-2024 02:30:31 AM

అనుమతి కోసంఈసీకి దరఖాస్తు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి మే 10వ తేదీవరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో అనుమతి కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి శుక్రవారం కలిసి యాత్రకు సంబంధించిన వివరాలను తెలిపారు. యాత్రకు భద్రత కల్పించాలని, పోలీసుల సహకారం అందించేలా చూడాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈసీని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభు త్వం మా పార్టీ కార్యకర్తలపై, సోషల్ మీడియా వారియర్స్‌పై దాడులు చేస్తూ గులాబీ ప్లెక్సీలను తొలగిస్తుందన్నారు. బహిరంగసభల్లో ప్లెక్సీలను తొలగించినట్లు పేర్కొన్నారు. యాత్ర లో మా పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు భరో సా ఇస్తారని తెలిపారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదని, పేరుకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టారని ఆరోపించారు.

అన్నదాతలకు పండించిన పంటలకు ఎంఎస్పీ ధరలకే కొనాలని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు విలువలేకుండా పోయిందన్నారు. తక్కువ ధరకే రైతు లు ధాన్యా న్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, అర్భాటంగా ప్రకటించిన రూ.500 బోనస్ జాడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ 4 నెలల పాలనలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు నష్టమే జరుగుతుందని, ప్రజల పక్షాన నిలబడే  బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిం చాలని కోరారు.