టచ్ చేస్తే మసే!

20-04-2024 02:38:33 AM

నీ కారు ఇక షెడ్డు దాటదు

n కేసీఆర్..నీ కథలకు కాలం చెల్లింది

n మేం తల్చుకొంటే మీ ఎమ్మెల్యే ఒక్కడు మిగలడు

n మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

పంద్రాగస్టులోగా 2 లక్షల రైతు రుణమాఫీ 

n వచ్చే సీజన్‌లో వరి ధాన్యానికి 500 బోనస్  

n బిడ్డ కోసం మోదీవద్ద తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు

n మహబూబాబాద్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్

 హైదరాబాద్/మహబూబ్‌నగర్, ఏఫ్రిల్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనతో టచ్‌లో ఉన్నారన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌చేసి చూడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కారు కథ ముగిసిందని.. ఇక కారు షెడ్డు దాటదని స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ‘చంద్రశేఖర్‌రావు తన కారు జర ఖరాబై గ్యారేజ్‌కి పోయిందంటున్నారు. మీ కారు ఖరాబ్ కాలేదు. ఇంజిన్ పోయింది. ఇక తూకానికి వేసి అమ్ముడే. ఎన్ని తిప్పలు పడ్డా రిపేర్ కాదు. నిన్నటికి నిన్న పిట్టల దొర తన దగ్గర 20 మంది ఎమ్మెల్యేలున్నారని అన్నడు. చిటికె వేస్తే వస్తారు అన్నడు. చిటికే కాదు బిడ్డా.. మిద్దె మీదికి ఎక్కి డప్పు కొట్టి చూడు.. మీ దగ్గర ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరు. కేసీఆర్.. నీ కథలకు కాలం చెల్లింది. మీతో తెలంగాణ ప్రజలకు ఇక పనిలేదు. మా ఎమ్మెల్యేలను ముట్టుకోవాలని చూస్తే కాలి బూడిదైపోతావ్’అని హెచ్చరించారు. 

మీ రంగు బయటపడింది

తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఆడ బిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చామని, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆడ బిడ్డలను ఆదుకుంటామన్న ప్రధాని మోదీ.. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే సీలిండర్ అందించి వారికి అండగా నిలబడిందని అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చి జనాభా దామాషా ప్రకారం వారికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 100 రోజుల్లో పాలమూరుకు రూ.10 వేల కోట్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.

‘గద్వాల దొరల గడీల ముందు, గజ్వేల్ దొరల గడీల ముందు బానిసల్లా మేం బతకలేం. గతంలో మాదిరిగా పాలమూరు బిడ్డలు మీ కనుసన్నల్లో ఉండరు. మీ రంగు బయటపడింది’ అని బీఆర్‌ఎస్, బీజేపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం మొదలుపెట్టిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని, నేడు తాము ప్లానింగ్ కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించి గౌరవించామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని, ఆగష్టు 15లోపు ఈ మాటను నిలబెట్టుకొంటామని తెలిపారు. మాదిగల వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘ఢిల్లీలో మోదీని చూశాం. గల్లీలో కేడీని చూశాం. వీల్ల వల్ల ఏమీ ఒరుగదు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పర్ణికరెడ్డి, వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ అంటున్నారు. మేం దిగిపోవడానికి అల్లాటప్పాగా రాలేదు. నన్ను దింపడం నీ తరం కాదు.. నీ అయ్యతరం కాదు కేసీఆర్. ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం. ప్రజా పాలన అందిస్తాం. తెలంగాణలో మరో పదేండ్లు మేమే అధికారంలో ఉంటాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. ‘భద్రాద్రి రాముడి సాక్షిగా చెప్తున్నా.. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. ఇది నా గ్యారెంటీ. రైతు పండించిన వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ను వచ్చే సీజన్‌లో అమలు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు 

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయని బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదని సీఎం రేవంత్ విమర్శించారు. ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ తెచ్చారా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెచ్చారా? కేడీ, మోదీ తోడు దొంగలు. ఒకడిని తెలంగాణ ప్రజలు బండకేసీ కొట్టారు. ఈ ఎన్నికల్లో మోదీని బండకేసి కొడుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మోదీ.. ఇక్కడికి ఏ ముఖ పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నారని నిలదీశారు. ఉత్తర భారత్‌లోని కుంభమేళాకు, గంగానది ప్రక్షాళనకు కేంద్రం వేలకోట్ల నిధులిచ్చి, మేడారం జాతరకు ముష్టి మూడు కోట్లు ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మోదీతో కేసీఆర్ కుమ్మక్కు 

మాజీ సీఎం కేసీఆర్ తన కూతరు కవితకు బెయిల్ కోసం మోదీతో కుమ్మక్కయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచేలా బీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులకు ఒక్క సీటు కూడ ఇవ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.  

జూన్ 9న రాహుల్ ప్రధానిగా ప్రమాణం 

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నుంచి 14 ఎంపీ సీట్లు గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుకగా ఇద్దామని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎరుగుతుందని అన్నారు. జూన్  9న రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న మోదీ.. అదే రైతులను కాల్చి చంపారని విమర్శించారు.

ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పిన కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క ఇల్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అంటూ చాంతాడంత హామీ లు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని సీఎం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పని చేస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి పార్టీల మద్దతు తీసుకుంటామని చెప్పారు. ఆ పార్టీలతో చర్చల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు తెలిపారు.