ఒట్టు.. దేవుడే దిక్కు!

23-04-2024 02:44:42 AM

l దేవుళ్లపై ఒట్టేస్తున్న సీఎం రేవంత్

l రైతులను ఆకట్టుకునేందుకే ఒక్కో చోట ఒక్కో దేవుడిపై ఒట్టు

l రుణమాఫీపై పెరుగుతున్న ఒత్తిడి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): అలంపూర్ జోగులాంబపై ఒట్టేసి చెబుతున్నా.. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం’

n ఈ నెల 19న మహబూబ్‌నగర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

 ‘ప్రపంచం తల్లకిందులైనా వచ్చే ఆగస్టు నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా’

n ఈ నెల 21న భువనగిరి రోడ్‌షోలో సీఎం రేవంత్ ‘బాసర సరస్వతి మందిరంపై ఒట్టేసి చెప్తున్నా.. పంద్రాగస్టు లోపల రైతాంగానికి రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తుంది మా ప్రభుత్వం.. నాదీ, మా మంత్రి వర్గానిది ఈ బాధ్యత’

n 22న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై వివిధ వర్గాల నుంచి వస్తున ఒత్తిడితో.. వారిని తృప్తిపరిచేందుకు ఆ పార్టీ నేతలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. గత నాలుగైదు రోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వెళ్లినచోటల్లా అక్కడి దేవుళ్లపై ఒట్టేసి హామీలు అమలుచేస్తానని ప్రమాణాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న రైతాంగాన్ని ఆకట్టుకొనేందుకు ‘ఒట్టు’ రాజకీయ రాజకీయాలు చేస్తున్నారు. అకస్మాత్తుగా ఈ ఒట్టు ఎందుకు వచ్చిందని ప్రజల్లో చర్చ జరుగుతున్నది. జోగులాంబ నుంచి మొదలుకుని.. బాసర సరస్వతి దేవాలయం వరకు ఎవరినీ వదలకుండా ఒట్టు పెట్టుకుంటూ వస్తున్నారు.

రైతాంగం దూరమవుతోందా?

రైతుల రుణమాఫీ అనేది ఏ పార్టీకైనా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగపడేదే. ప్రస్తుతం ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ రైతుల రుణమాఫీ ఎందుకు చేయడం లేదంటూ రేవంత్‌ను నిలదీస్తున్నాయి. రైతాంగంలో ఉన్న అసంతృప్తి గ్రహించి ప్రచారాస్త్రంగా మలుచుకొన్నాయి. దీంతో రైతులకు గట్టిగా హామీ ఇవ్వకపోతే నష్టం తప్పదని గ్రహించిన సీఎం రేవంత్.. ఇలా ఒట్టు పాట మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తు ఎన్నికల ప్రచారంలో దేవుడి ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. అయోధ్య రాముడి పేరును పలకకుండా బీజేపీ నుంచి మొదలుకుని.. ఏ పార్టీ కూడా ప్రచారం నిర్వహించడం లేదు. ప్రచారం యావత్తూ.. దేవుళ్ల చుట్టూనే తిరుగుతున్నది. ఈ నేపథ్యంలో అటు దేవుడి ప్రభావాన్ని ఉపయోగించుకోవడంతపాటు.. ఇటు రైతాంగాన్ని ఆకట్టుకునేలా సీఎం హామీ ఇస్తున్నట్టు భావిస్తున్నారు.

వెళ్లినచోటల్లా ఒట్టు 

రాష్ట్రంలో అనేక ముఖ్యమైన దేవాలయాలున్నాయి. ఆయా దేవుళ్లపై వాటి చుట్టుపక్కల ప్రజల నమ్మకం కాస్త ఎక్కువగానే ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని అవకాశంగా మలుచుకుంటూ.. స్థానిక దేవుడిపై ఒట్టు పెడుతున్నారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి మార్గంలా భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జోగులాంబపై, ఆ తరువాత యాదాద్రిపై.. సోమవారం బాసర సరస్వతీ దేవాలయంపై ఒట్టువేశారు.