calender_icon.png 19 May, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయ్‌బరేలీ బరిలో రాహుల్

04-05-2024 12:26:32 AM

అట్టహాసంగా నామినేషన్

వెంట వచ్చిన తల్లి సోనియా, చెల్లి ప్రియాంక

అమేథీ నుంచి పోటీలో కిశోరీ లాల్ శర్మ

న్యూఢిల్లీ, మే 3: దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల్లా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలకు ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపింది. అమేథీ నుంచి తొలిసారి నెహ్రూ కుటుంబం కాకుం డా బయటివారికి అవకాశం కల్పించింది. ఇక్కడి నుంచి సీనియర్ నేత కిశోరీలాల్ శర్మను బరిలోకి దింపింది. కొన్నివారాలుగా ఊరిస్తూ వస్తున్న ఈ రెండు స్థానాల అభ్యర్థిత్వాలను శుక్రవారం ఏఐసీసీ ఖరారు చేసిం ది. ఆ వెంటనే చకచకా కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఉదయం అభ్యర్థిత్వం ఖరారు కావటమే ఆలస్యం.. మధ్యాహ్నానికి రాహుల్‌గాంధీ కుటుంబసమేతంగా వెళ్లి రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి సోనియాగాంధీ, చెల్లి ప్రియాంక కూడా ఉన్నారు. 

సుదీర్ఘ సస్పెన్స్‌కు తెర

లోక్‌సభ షెడ్యూల్ రాకముందు నుంచే రాహుల్‌గాంధీ ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న చర్చ మొదలైంది. ఆయన తల్లి సోనియా ఎన్నికల షెడ్యూల్‌కు ముందే రాజ్యసభకు వెళ్లిపోవటంతో, కొద్ది రోజుల క్రితం రాయ్‌బరేలీ నుంచి పోటీకి తాను సిద్ధమని ప్రియా ంక భర్త రాబర్ట్ వాద్రా ప్రకటించటంతో సస్పెన్స్ మరింత పెరిగింది. రాహుల్‌గాంధీ  అమేథీ నుంచి ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరా నీ చేతిలో ఓడిపోయారు. వయనాడ్ నుంచి గెలిచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా వయనాడ్‌లో ముం దుగానే పోటీలోకి దిగారు. అయితే, అమేథీ నుంచి మళ్లీ పోటీ చేస్తారా లేదా అన్నది ఇంతకాలం సందేహం ఉన్నది. ఎవరూ ఊహించని విధంగా ఆయన రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగటంతో బీజేపీ సెటైర్లు వేస్తుండగా, వ్యూహంలో భాగంగానే ఆయన అమేథీ నుంచి రాయ్‌బరేలీకి వెళ్లారని పరిశీలకులు అంటున్నారు.  

కాంగ్రెస్‌కు కంచుకోట

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్నాయి. రాయ్‌బరేలీలో ఇప్పటి వరకు 20సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 17 సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచిందంటే ఆ పార్టీకి ఉన్న పట్టును అర్థంచేసుకోచ్చు. అమేథీని 2019లో బీజేపీ చేజిక్కించుకొన్నా ఇప్పటికీ కాంగ్రెస్‌కు పట్టు ఏమీ సడలలేదు. అయితే, చరిత్రలో రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి హోదాలో 1977లో ఇక్కడి నుంచి పోటీచేసిన ఇందిరాగాంధీని జనతాపార్టీ అభ్యర్థి రాజ్‌నారాయన్ ఓడించారు. దేశంలో ఎమర్జెనీ విధించిన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేక గాలి వీయటంతో ఏకంగా ప్రధాని కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఈ స్థానం నుంచి ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌గాంధీ కూడా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. రెండు దశాబ్దాలపాటు సోనియా ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు.

పోటీకి ఒప్పుకోని ప్రియాంక

ఉత్తరాదిలో పోయిన ప్రభవాన్ని తిరిగి సంపాదించుకొనేందుకు రాహుల్, ప్రియాంకను ఈ రెండు స్థానాల నుంచి పోటీకి దింపాలని ఏఐసీసీ మొదటినుంచీ భావించింది. అయితే, కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే కుటుంబ పార్టీ అని నిందలు వేస్తుండటంతో ప్రియాంక పునరాలోచించినట్టు సమాచారం. ఆమెను అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని ప్రియాంకను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరినట్టు సమాచారం. అయితే, ఆమె పోటీకి నిరాకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాను లోక్‌సభకు పోటీ చేస్తే కుటుంబ పార్టీగా కాంగ్రెస్‌పై నిందలు వేసేందుకు బీజేపీకి మరింత అవకాశం చిక్కు తుందని, అందుకే తాను పోటీకి దూరంగా ఉంటానని చెప్పినట్టు తెలిసింది.