నిజాం షుగర్స్ తెరిపిస్తాం

23-04-2024 02:48:45 AM

బాసర ఆలయం మీద ఒట్టు.. సెప్టెంబర్ 17లోగా పునఃప్రారంభిస్తాం

n ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ

n ఓటమి తప్పదని తెలిసి మోదీ మత రాజకీయాలు

n కమ్యూనిస్టునని చెప్పుకొనే ఈటల రాముడితో రాజకీయం

n నా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మోదీ, కేసీఆర్ కుట్ర

n ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి సభల్లో సీఎం రేవంత్

నిజామాబాద్/ఆదిలాబాద్/ మేడ్చల్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వచ్చే సెప్టెంబర్ 17వ తేదీలోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘బాసర మందిరంమీద ఒట్టేసి చెప్తున్నా.. తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు అగస్టు15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతం. అలాగే సెప్టెంబర్ 17లోపు నిజాం షుగర్స్‌ను తెరిపిస్తా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లా రైతులకు పసుపు బోర్డును మంజూరు చేస్తాం.

లేకుంటే దానికోసం పోరాటం చేస్తాం’ అని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం నిజామాబాద్, ఆదిలాబాద్‌తోపాటు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అంతాయిపల్లిలో ఏర్పాటుచేసిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. వచ్చే వర్షాకాలం నుంచి రైతులకు వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోసన్ ఇస్తామని తెలిపారు. పంజాబ్, హర్యానా రైతులు వ్యవసాయ నల్లచట్టాలపై పోరాడి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రద్దు చేయించారని, వారి తర్వాత అంతటి చైతన్యం నిజామాబాద్ జిల్లా రైతుల్లో ఉన్నదని కొనియాడారు. 

నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఢిల్లీలో మోదీ.. గల్లీలో కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను బండకేసి కొట్టారని, లోక్‌సభ ఎన్నికల్లో మోదీని సైతం బండకేసి కొడతారని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో వంద రోజుల్లోనే ఐదింటిని అమలుచేసిన ఘనత తన ప్రభుత్వానిదని సీఎం అన్నారు. ప్రభుత్వం హామీలను అమలుచేయటం లేదని చెప్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ను నడిరోడ్డు మీద ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉచిత కరెంటు ఆపాలని మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతూ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మోదీ నిధులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టి దానికి అంబేద్కర్ పేరు పెట్టి తీరుతామని స్పష్టంచేశారు. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, అక్కడి ముంపు ప్రాంతాల ప్రజలను అదుకొనేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పారు. యువత కోసం ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడైనా సరే ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెం ట్ పరిశ్రమను తెరిపిస్తామని తెలిపారు.   

బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ తాకట్టు

కూరుతు కవిత బెయిల్ కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాలు తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ విమర్శించారు. ఐదుచోట్ల బీఆర్‌ఎస్ నుంచి బలహీనమైన అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘అమిత్ షా నా బేబులో ఉన్నాడని, ఏ పనైనా క్షణాల్లో చేయిస్తానని చెప్పుకునే ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో మూడేండ్లపాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి కేంద్రం సహకారంతో ఏం అభివృద్ధి చేశావు? అక్కడి ఓడిపోయి గతిలేక ఇక్కడ పోటీ చేస్తున్నావు. నీకు ధైర్యముంటే, అమిత్ షాతో చనువుంటే.. కాలేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇరుకున్న కేసీఆర్ కుటుంబంపై ఎందుకు విచారణ జరిపించడంలేదు?’ అని ప్రశ్నించారు.

పక్కా కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటల, రాముడి పేరుతో నీచ రాజకీయాలు చేస్తూ ఎలా ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ప్రజలు వివేకంతో ఆలోచించి సునీతను గెలిపించాలని కోరారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నేతలు పట్నం మహెందర్‌రెడ్డి, మధుయాష్కి, సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మైనంపల్లి హన్మంతరావు, హరివర్ధన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, రేకులపల్లి భూపతిరెడ్డి, వెడ్మ బోజ్జు, వినోద్, కోనప్ప, బాబురావు, రేఖ నాయక్, నారాయణ్‌రావు పటేల్, సత్తు మల్లేష్, అడ్డి భోజరెడ్డి, కంది శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.