మోదీతోనే భారత్ ముందంజ

24-04-2024 01:22:16 AM

l విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్

l భువనగిరిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ పదేండ్ల పాలనలో భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భువనగిరి ఎంపీగా బూర నర్సయ్య గౌడ్‌ను గెలిపించాలని కోరారు. మంగళవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విజయ సంకల్ప నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో దేశంలో బీజేపీ, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్ గెలవబోతున్నారని అన్నారు.

పదేండ్ల క్రితం దేశం వెనుకబడి ఉండేదని, మోదీ హయాంలో సంక్షేమ బాట పట్టిందని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితోనే భువనగిరిలో ఎయిమ్స్, ట్రిపుల్ ఆర్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటయ్యాయని వెల్లడించారు. దేశ భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నదని పునరుద్ఘాటించారు. మోదీ హయాంలోనే ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరిందని స్పష్టంచేశారు. జీ ౨౦ సమావేశాల్లో వివిధ దేశాల వారికి పోచంపల్లి చీరలు పంపిణీ చేసిందని, పోచంపల్లి చీరలకు విశ్వఖ్యాతి తెచ్చిందని అన్నారు. మోదీ అంటేనే గ్యారంటీ అని.. ఆ గ్యారెంటీతోనే ఈ ఎన్నికలల్లో గెలువనున్నట్టు స్పష్టంచేశారు.  

మోదీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదు: ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, సూర్యుడి మీద ఉమ్మి వేస్తే, తిరిగి నీ ముఖం మీదే పడుతుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నా రు. ప్రపంచం గర్వపడే నాయకుడు మోదీ అని, కాంగ్రెస్ పార్టీకి మోదీని విమర్శించే అర్హత లేదని చెప్పారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, గతంలో ఉగ్రవాదులు చనిపోతే మీ పార్టీ వారు బాధపడ్డ మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ రజాకారుల వారసత్వం గల మతతత్వ పార్టీ మజ్లిస్‌తో జతకట్టే మీరు.. మతం పేరు మా ట్లాడుతున్నారా అని ధ్వజమెత్తారు. భువనగిరి ప్రజలు ఓటు అనే ఆయుధంతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, సీఎం రేవంత్‌రెడ్డికి కర్రు కాల్చి వాతపెడతారని అన్నారు.

భువనగిరిలో బీజేపీని గెలిపించి, నరేంద్రమోదీకి గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. అనంతరం బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఇది పాండవులకు, కౌరవులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయాల్లోకి రాకముందు రూ.19 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.450 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. అదంతా భువనగిరి ప్రజల రక్తంతో సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేఈ శాసనసభా పక్షనేత మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు చికోటి ప్రవీణ్, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.