దేశాన్ని విశ్వబంధుగా మార్చాం

24-04-2024 01:40:35 AM

l మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం

l చైనా చొరబాటును సమర్ధవంతంగా తిప్పికొట్టాం

l కశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాతో దేశంలో కలిపేశాం

l విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): విదేశీ వ్యవహారాల్లో భారత్‌ను విశ్వబంధుగా తీర్చిదిద్దుతున్నామని, భవిష్యత్తులో మనదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇండియా ఫస్ట్ తమ నినాదమని, దేశ ప్రయోజనాల తర్వాతే మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. క్వాడ్‌లో మనం భాగస్వాములమైనా ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఆంక్షలున్న రష్యా చమురును కొనుగోలు చేశామని... ఇది ఇండియా ఫస్ట్‌కు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

‘ఫారిన్ పాలసీ ద ఇండియా వే, ఫ్రమ్ డిఫిడెన్స్ టు కాన్ఫిడెన్స్’ అనే అంశంపై ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు అధ్యక్షతన హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొవిడ్ సమయంలో ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నామని తెలిపారు. 125 దేశాల గ్లోబల్ సౌత్ ప్రతినిధిగా ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చామన్నారు. 

సరిహద్దులు పటిష్ఠం

ఒకప్పుడు మనదేశ సరిహద్దులు అంటేనే బలహీనమైనవిగా ప్రపంచం భావించేదని, ఇప్పుడు మౌలిక వసతులను పెంపొందించుకుని సరిహద్దులను శత్రు దుర్భేధ్యంగా తీర్చిదిద్దామని ప్రపంచానికి కూడా ఓ సందేశం పంపించామని జైశంకర్ తెలిపారు. సరిహద్దులపై చైనా దాడి చేసి చొచ్చుకువచ్చే అవకాశం ఉందని అప్పటి హోమంత్రి మంత్రి సర్ధార్ వల్లభాయి పటేల్ హెచ్చరించినా నాటి ప్రధాని పెడచెవిన పెట్టారని, ఫలితంగా మనదేశంపై డ్రాగన్ ఆక్రమణకు ప్రయత్నించిందని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక చైనా మరోసారి చొరబాటుకు ప్రయత్నించినా సమర్ధంగా తిప్పికొట్టామని, ఇది మన సరిహద్దుల భద్రత, మన సైన్యం సమర్ధతకు అద్దం పడుతుందని పేర్కొన్నారు. మన దేశంపై ఉగ్రదాడులు చేస్తే వారి దేశంలోకి వెళ్లి మరీ దాడులు చేస్తామని పాకిస్తాన్‌కు హెచ్చరించిన ఘనత మనది అని అన్నారు. కశ్మీర్ విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే... తాము ఆర్టికల్ 370 రద్దు చేసి పూర్తి రాష్ట్ర హోదాతో మనదేశంలో కలిపేశామని చెప్పారు.  

మే 13న ఖచ్చితంగా ఓటేయండి

మనదేశం కోసం, మనదేశ భద్రత కోసం, దేశంలోకి ఉగ్రవాదులు రావాలంటేనే భయపడేలా చేసేందుకు, మనదేశ గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రతి ఓటర్ వచ్చే నెల 13న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో సాధ్యం కాని ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను గత పదేళ్లో మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.