చెంపదెబ్బ కొట్టాలంటే భయమేసింది!

26-04-2024 02:36:45 AM

తెలుగులో ‘సీతా రామం’ చిత్రంలో అందరి హృదయాలను దోచుకున్న భామ ‘మృణాల్ ఠాకూర్’ ఈ చిత్రంలో సీతగా ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీస్టార్’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఆ చిత్రం ఆమె అభిమానులను కాస్త నిరాశపరిచింది. అయితే తాజాగా ఆమె నటించిన హిందీ ‘జెర్సీ’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుని, ఆ అనుభూతులను నెమరువేసుకున్నారు మృణాల్. షాహిద్ కపూర్ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. నాని కథానాయకుడిగా తెలుగులో వచ్చిన ‘జెర్సీ’కి ఇది రీమేక్. ఈ చిత్రంలో షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించారు. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘నేను షాహిద్ కపూర్‌ని అభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం అనగానే మారు మాట లేకుండా సరే అన్నాను.

మొదటిరోజు సెట్స్‌లో ఆయన్ని అలా చూస్తు వుండిపోయాను. షాహిద్‌తో కలిసి నటించిన రోజులు లైఫ్ టైమ్ మెమరీ. మొదట్లో ఆయనతో నటించడం అంటే కాస్త టెన్షన్ పడ్డాను. కొన్ని రోజుల తరువాత ఆ భయం నుంచి బయటపడ్డాను. ఈ సినిమాలో ఓ సన్నివేశం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ సినిమాలో ఓ సన్నివేశంలో నేను షాహిద్‌ను కొట్టాలి. నేను నిదానంగా కొడతాను. మీరు ఎడిట్‌లో యాడ్ చేసుకోండి అంటే దర్శకుడు అంగీకరించలేదు. ఈ సీన్‌కు షాహిద్ చాలా సపోర్ట్ చేశాడు. మీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని గుర్తుచేసుకుని నన్ను చెంపదెబ్బ కొట్టండి అని తమాషాగా అన్నాడు. ఆ సన్నివేశం చిత్రీకరించడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది’ అని చెప్పుకొచ్చారు.