31-07-2025 01:40:44 AM
-అదనంగా పెనాల్టీ కూడా విధింపు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
- ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడి
- మిత్రదేశమైనప్పటికీ భారత్‌తో వ్యాపారం తక్కువే
న్యూయార్క్, జూలై 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల బాంబు పేల్చారు. భారత్ దిగుమతి చేసుకునే తమ దేశ వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. తాము వద్దని వారించినా వినకుండా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు సుంకాలతో పాటు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలతో పాటు పెనాల్టీ చెల్లింపు అమల్లోకి రానున్నట్టు తెలిపారు. అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందని, అందుకే సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు.
రష్యా నుంచి భారత్ ఎక్కువగా సైనిక ఉత్పత్తులు కొంటుందని.. ముఖ్యంగా చమురును అధికంగా దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. భారత్ తమకు మిత్రదేశమైనప్పటికీ వారితో తమ వ్యాపారం తక్కువేనని ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌పై సుంకాల పెంపు విషయాన్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ‘ఒక్క విషయం గుర్తుంచుకోండి.. భారత్ మనకు మిత్ర దేశంగా ఉన్నప్పటికీ, మేము వారితో చాలా తక్కువ వ్యాపారం చేశాము. ఎందుకంటే వారి సుంకాలు మన దేశంపై చాలా ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచంలోనే అధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. అంతేకాదు వారు ఏ దేశంలోనూ లేనంత అత్యంత కఠినమైన ద్రవ్యేతర వాణిజ్య విధానాన్ని కలిగి ఉన్నారు. సైనిక పరికరాల్లో ఎక్కువ భాగాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడులు రష్యా దాడులు ఆపాలని అందరూ కోరుకుంటున్న సమయంలో చైనా, భారత్‌లు మాత్రం రష్యా నుంచి అధిక చమురు కొనుగోలు చేస్తున్నాయి. రష్యాకు భారత్ అతి పెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. ఇది మంచిది కాదు.
అందువల్లే భారత్‌పై ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకంతో పాటు అదనంగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇటీవల భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్.. ఆగస్ట్ 1ని డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి ఏప్రిల్‌లోనే ప్రకటన చేసినప్పటికీ చర్చల కోసం వీటి అమలుకు గడువు ఇచ్చారు.
దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం
భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్న ట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మే రకు ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్య లు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపింది.